AEE: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్రమార్జనలో సంచలనాలు బయటపడుతున్నాయి. నిఖేశ్ తన స్నేహితుడి బ్యాంకు లాకర్‌లో కిలోన్నర బంగారం, ప్లాటినం నగలు, వజ్రాభరణాలు దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్థిరాస్తులకు సంబంధించి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

author-image
By srinivas
New Update
rerete

TG NEWS: నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఏసీబీ దాడుల్లో మరింత అక్రమాస్తుల జాబితా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ.17.73కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. తాజాగా బండ్లగూడ జాగీర్‌లోని ప్రముఖ బ్యాంకులో అతని స్నేహితుడి బ్యాంకు లాకర్‌లో కిలోన్నర బంగారు ఆభరణాలతోపాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలు దాచినట్లు గుర్తించారు. అలాగే విలువైన స్థిరాస్తులకు సంబంధించి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

వెలుగులోకి మరిన్ని లాకర్లు.. 

ఈ మేరకు నిఖేశ్ కుమార్ అరెస్ట్‌ కాబోతున్నట్లు ముందే పసిగట్టి 20 రోజుల ముందే స్నేహితుడి బ్యాంకు లాకర్‌లో దాచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు తనపై దృష్టి సారించారనే అనుమానంతోనే ఈ చర్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ఇక నవంబరు 30న నిఖేశ్‌ను అరెస్ట్‌ చేసిన రోజే అతడి ఇంట్లో 8 బ్యాంకు లాకర్ల తాళాలను గుర్తించామని, వాటిలో రెండు నిఖేశ్‌ స్నేహితుల పేర్లపై ఉన్నట్లు దర్యాప్తు తేలినట్లు తెలిపారు. అయితే నిఖేశ్‌ స్నేహితుడి సమక్షంలోనే గురువారం ఒక లాకర్‌ను తెరిచారు. మరో స్నేహితుడి పేరిట ఉన్న లాకర్‌ను రెండు రోజుల్లో తెరవనున్నారు. నిఖేశ్‌ను కస్టడీకి తీసుకున్న అనంతరం అతడితోపాటు కుటుంబసభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను తెరబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 

వారం రోజులపాటు కస్టడీ..

ఇక నిఖేశ్ కుమార్ ను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు సోమవారం విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే నిఖేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పైనా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఇటీవల నిఖేశ్ కుమార్, ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు చేపట్టిన ఏసీబీ ఆదాయనికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం నిఖేశ్ కుమార్ ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరుచగా ఆయనకు కోర్డు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఏసీబీ అధికారులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు. కాగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన నిఖేశ్ కుమార్ ను లోతుగా విచారిస్తే ఆయన వెనుక ఉన్న మరి కొంత మంది కీలక అధికారుల బాగోతం బయపడనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు