Adilabad: 'బాలశక్తి'.. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యా, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అవగాహన పెంపొందిచేందుకు 'బాలశక్తి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలోని 52 విద్యాసంస్థల్లో దీనిని శుక్రవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

New Update
abls

Baala Shakthi: ఆదిలాబాద్ కలెక్టర్ అభిలాష అభినవ్‌ జిల్లాలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా వారిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా 'బాలశక్తి' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలశక్తిని అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే శుక్రవారం 52 విద్యాసంస్థల్లో ప్రారంభిచనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని నాలుగు ప్రధాన అంశాలతోపాటు వాట్సప్‌ గ్రూపు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, వెబ్‌సైట్‌ రూపకల్పన, విద్య సాంకేతిక సంస్థల సందర్శన వంటి కార్యక్రమాలు రూపొందించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, ఆరోగ్య పరిరక్షణ, శారీరక, మానసిక ఎదుగుదలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే బాలశక్తి ముఖ్య ఉద్దేశమని జిల్లా అధికారి చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 6 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. 

ఆర్థిక అక్షరాస్యత సహకారం: ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై విద్యార్థులతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ఇప్పించడం.  కిడ్డీ బ్యాంకు నిర్వహణ. పొదుపు పథకాలు, సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించనున్నారు.

ఆరోగ్యంపై అవగాహన: విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం. పోషకాహార లోపం, ఊబకాయం, విటమిన్‌ లోపం, రక్తహీనత, థైరాయిడ్ వంటి వాటి గురించి తెలియజేయడం. బాలికలకు రుతు పరిశుభ్రతపై అవగాహన కలిగించడం. విద్యార్థులందరికీ కంటి పరీక్షలు. మానసిక సమస్యలు గుర్తించి నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించడం చేయనున్నారు. 

సాంకేతికత: విద్యార్థులకు విద్య, కంప్యూటర్‌ పరిజ్ఞానం, జీవన, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కల్పించడం. బాలికలకు గుడ్ అండ్ బ్యాడ్ టచ్ పై  అవగాహన. యోగా, ధ్యానం, చిత్రలేఖనం, పెయింటింగ్, వ్యాసరచన, ఉపన్యాసం, చర్చ, నిర్వహణ. కళా నైపుణ్యాలు, ఉపాధి మార్గలకు సంబంధించి మార్గదర్శనం చేస్తారు.

క్షేత్ర పర్యటనలు: తపాలాశాఖ, పోలీస్‌స్టేషన్, న్యాయస్థానం, గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మీ సేవా, అంగన్‌వాడీ కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, నీటి ప్రాజెక్టులు, వ్యవసాయ, పరిశోధన క్షేత్రాలు, ఉన్నత విద్య, సాంకేతిక సంస్థలను సందర్శించేలా చూడటం. స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు ఏర్పరుకునేలా చర్యలు. 

Advertisment
తాజా కథనాలు