/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
Telangana High Court
BC Reservation : రాష్ట్రంలో కొంత కాలంగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 న్యాయసమీక్షకు నిలుస్తుందా? లేదా అన్నదానిపై తెలంగాణ ప్రజలు అసక్తిగా గమనిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయా? లేదా? ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? లేదంటే వాయిదా పడతాయా? అనేది తేలనుంది.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నెం 9 జారీ చేసిన విషయ తెలిసిందే. దానికి అనుగుణంగా పంచాయతీరాజ్​శాఖ సైతం 41, 42 జీవోను జారీ చేసింది.కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా స్థానిక రిజర్వేషన్లను ఖరారు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు.. మొత్తంగా 67% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ఇది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌ను మించిపోతున్నది. పైగా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం వాటి అమలు కోసం జీవోను విడుదల చేసింది. ఇలా ఎటుచూసినా ఈ రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని న్యాయకోవిదులు స్పష్టంగా తేల్చిచెప్తున్నారు. మరోవైపు బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు హైకోర్టునును ఆశ్రయించారు.
ఈ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు (రిజర్వేషన్లు 50% దాటొద్దు) విరుద్ధమని, ఆ జీవోలను కొట్టేయాలని రెడ్డి జాగృతి నేత బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. గత నెల​27న ఆయన హైకోర్టులో హౌస్‌మోషన్​పిటిషన్​దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం11 గంటలకు హైకోర్టులో కోర్టు 1లో 42 అంశంగా ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్​సింగ్ ధర్మాసనం ముందుకు రానున్నది. అయితే ఈ పిటిషన్‌పై 25 మందికి పైగా రాష్ట్ర బీసీ నాయకులు ఇంప్లీడ్​పిటిషన్​దాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్​కృష్ణయ్య, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జూజుల శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, చరణ్​కౌశిక్​యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్​చిరంజీవులు తదితరులు ఉన్నారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయంగా గుర్తింపు రావడానికి బీసీ నాయకులు కోరుతున్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ అంశాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నది. హైకోర్టులో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఒక రోజు ముందే ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బృందం న్యాయనిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించింది. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్​అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే హాజరయ్యారు. నేడు హైకోర్టులోనూ విచారణ ఉండటంతో స్వయంగా హాజరు కావాలని సింఘ్వీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఫోన్ చేసి రిక్వెస్టు చేశారు. దీంతో ఆయన నేడు హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బీసీలకు కాంగ్రెస్​ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, కులగణనతో సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశామని హైకోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా త్రిపుల్​టెస్ట్, డెడికేటెడ్​కమిషన్‌ను నియమించామని కోర్టుకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం అవసరమైన అన్ని రకాల ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసిందని, జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి గతంలో బిల్లులు తీసుకువచ్చామని, ఆరు నెలలుగా అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాదించనున్నారు. సామాజికంగా బీసీలు వెనకబడి ఉన్నారని, వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి, వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కోర్టుకు తెలియజేయాలని నిర్ణయించారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో చట్టపరంగా చేయాల్సిందంతా పద్ధతి ప్రకారం చేశామని, దీనిపై హైకోర్టులో జరిగే విచారణలో బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నాడు. న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా కులగణన సర్వే నిర్వహించి.. ఎంపిరికల్ డాటా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించామని ఆయన చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 న్యాయసమీక్షకు నిలుస్తుందన్న విశ్వాసాన్ని రేవంత్ వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో బుధవారం విచారణ జరుగుతున్న సందర్భంలో బీసీ మంత్రులంతా అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. రిజర్వేషన్‌కు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చి.. కేసులో ఇంప్లీడ్ అయినవారు కూడా విచారణ సందర్భంగా అందుబాటులో ఉండాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వం నమ్ముతుంది. తీర్పు సానుకూలంగా లేకపోతే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి ముందుకెళ్లాలా? లేక న్యాయపోరాటం కొనసాగించాలా? అన్నదానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకు వెళ్లాల్సి వస్తుందని, అలా అయితే ఎన్నికలు మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తీర్పును మరో తేదీకి వాయిదా వేస్తే.. తుది తీర్పు వచ్చే దాకా ప్రభుత్వం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఒక వేళ కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఎన్నికలకు వెళ్తే.. ఆ ఎన్నికలు సైతం కోర్టు రద్దుచేయొచ్చని, మహారాష్ట్రలో ఇలాంటి సంఘటనే జరిగిందని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొంటున్నారు. సాంకేతికంగా సాధ్యం కాకుంటే ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారడం తప్పనిసరిగా కనిపిస్తోందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బీసీలకు మళ్లీ పాత రిజర్వేషన్లే దిక్కయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చననే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభావం ఉండటంతో అందరి దృష్టి అటువైపే ఉంది.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!