గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంతో గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా సాగుతోంది. ప్రభుత్వం మొత్తం 10 బిల్లులు ప్రవేశపెడితే మూడింటికి మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపారు. మిగతా రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రభుత్వం పంపగా మరో రెండు బిల్లులపై గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును రిజెక్ట్ చేశారు. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి ప్రభుత్వానికి పంపించారు.
పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలను మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు. బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. ప్రభుత్వం కావాలని నన్ను బ్లేమ్ చేస్తే నేను బాధ్యురాలిని కాను అన్నారు. నేను రాజకీయమైన యాక్టింగ్ చేయడం లేదు.నేను చెప్పిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం అంటూ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు.
త్వరలో వరద ముంపు ప్రాంతాలనూ సందర్శించనున్న గవర్నర్ తమిళిసై
అకాల వర్షాలపై గవర్నర్ స్పందిస్తూ తెలంగాణలో అకాల వర్షాల మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ తనని చాలా బాధ కలిగించాయన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాదేస్తోందన్నారు. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. రిమోట్ ఏరియా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు మెమోరాండం ఇచ్చాయన్నారు. హైదరాబాద్ ఏరియాలో వర్షాల వల్ల చాలా ఎఫెక్ట్ అయిందన్నారు. నీట మునిగిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. వర్షాలపై ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని ఆమె అన్నారు. నివేదిక వచ్చిన వెంటనే కేంద్రానికి పంపుతానని తెలిపారు. త్వరలో వరద ముంపు ప్రాంతాలనూ భాధిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటించనున్నట్లు ప్రకటించారు.