గడ్డం ప్రసాదరావు.. తెలంగాణకు తొలి దళా స్పీకర్. కాంగ్రెస్ పార్టీలో ఈయన సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రసాదరావు చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా చేశారు. ప్రసాదరావు 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ పట్ల విధేయతగా ఉండే ప్రసాదరావును అధిష్టానం ఇప్పుడు స్పీకర్ పదవికి ఎంపిక చేసింది.ప్రసాద్ అయితేనే బాగుంటుందని ఎక్కువ మంది నేతలు కోరుకున్నారు కూడా.
Also Read:ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో ప్రసాదరావు జన్మించారు. తాండూరులో ఇంటర్మీటియట్ వరకు చదువుకున్న ఈయన 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమసమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత 2009 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి ఎ. చంద్రశేఖర్ రావు మీద విజయం సాధించారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ తోనే ఉన్నారు. ఆ విశ్వాసమే నేడు స్పీకర్ పదవిని తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా కూడా ప్రసాదరావు పని చేశారు.
2009 తర్వాత ఆ తరువాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రసాదరావు పరాజయాన్ని చవి చూశారు. బీఆర్ఎస్ అభ్యర్ధి సంజీవరావు చేతిలో ఈయన ఓడిపోయారు. అయినప్పటికీ.. ఈయన మీద ఉన్న నమ్మకంతో ఈసారి ఎన్నికల్లో వికారాబాద్ టికెట్‌ను కేటాయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ కు చెందిన డాక్టర్ మెతుకు ఆనంద్‌పై గడ్డం ప్రసాదరావు 12,893 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. గడ్డం ప్రసాద్‌కు మొత్తం 86,885 ఓట్లు పోల్ అయ్యాయి.