Telangana: కాళేశ్వరంలో భారీ అవినీతి.. మంత్రుల సంచలన ఆరోపణలు..

Telangana: కాళేశ్వరంలో భారీ అవినీతి.. మంత్రుల సంచలన ఆరోపణలు..
New Update

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రులు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు కూలిపోయిన ఘటనలో బాధ్యులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారం నాడు రాష్ట్ర మంత్రులు ఐదుగురు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వినోద్‌లు మేడగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయన్నారు.

ప్రాజెక్టు కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకంటే తక్కువ ఆయకట్టు ఉందన్నారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం పనులు చేయించిందని ఆరోపించారు ఉత్తమ్. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, ఈ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు ఏడాదికి 10 వేల కోట్లు వడ్డీని తెలంగాణ ప్రజలు కట్టాల్సి వస్తోందన్నారు. అక్టోబర్ 21 న పిల్లర్ కూలిపోతే.. కేసీఆర్ కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదని విమర్శించారు. మూడేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు కట్టిన వారే ఈ ఘటనకు బాధ్యులు అని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్.

నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందన్న మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం లాంటి నాణ్యత లేని ప్రాజెక్టును ఎక్కడా కట్టలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులలో అన్నీ లోపాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. మూడేళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులా లేనే లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును మళ్ళీ చేపట్టి వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే, పాలమూరు రంగరెడ్డి ప్రాజెక్ట్ విషయంలో జాతీయ హోదా కోసం పోరాటం చేస్తామన్నారు మంత్రి.

మేడిగడ్డపై సమీక్ష..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మూడు బ్యారేజీలపై అనుమానాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పిల్లర్లు కుంగిపోవడంపై డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని, వాటిని నిర్ధారించడానికి సమీక్ష చేస్తామని తెలిపారు మంత్రి. మరికాసేపట్లో ఇరిగేషన్ అధికారులు.. మంత్రులకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Also Read:

హైదరాబాద్ లో ఇల్లు కొనడమంటే కష్టమే గురూ.. దేశంలోనే ఎక్కువ ధరలు!

త్వరలో దావోస్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి!

#telangana-ministers #telangana #medigadda-barrage #medigadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి