Telangana Minister Seethakka: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. శనివారం ములుగు(Mulugu) జిల్లాలోని బండారు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ప్రజా పాలన(Prajapalana) సభలో దరఖాస్తులను సమర్పించలేని వారు.. జనవరి 6వ తేదీ వరకు తమ అప్లికేషన్ ఫామ్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని సూచించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునే విధంగా పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రజాపాలనా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు మంత్రి సీతక్క. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీతక్క.
ప్రజా పాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, గ్రామంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ పరిధిలో రావాల్సిన పథకాలకు దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించాలని మంత్రి తెలిపారు.
మేడారం జాతరకు మరో రూ. 30 కోట్లు..
మేడారం జాతరకు అదనంగా మరో రూ. 30 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందించడం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. జాతర విషయంలో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు చెల్లిస్తామని తెలిపారు మంత్రి సీతక్క. అధికారులు అయ్యే పని చెయ్యాలని, కానీ పని తమకు చెప్పాలని సూచించారు. 'ప్రజా పాలన అంటేనే ప్రజలకు సేవ,
ప్రజలకు సేవ చేసే అధికారులను ఆదరిస్తాం.' అని పేర్కొన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. స్కూల్ ప్రాంగణంలో అంగన్వాడీ సెంటర్ల నిర్మాణం చేపడతామని చెప్పారు మంత్రి.
Also Read:
రూ. 50 వేల కోట్లు బొక్కిన మేఘా కృష్ణా రెడ్డి.. సీబీఐ విచారణ?