TG Govt Schemes: రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల్లో కీలక మార్పులు!

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పలు పథకాల్లో మార్పులు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. రైతు బంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth Reddy: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

Telangana: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు, రైతు బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాలను కొనసాగిస్తూనే పలు మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

దళారులతో పనిలేకుండా..
దళారులతో పనిలేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుడికి పథకం ప్రయోజనాలు అందేలా మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు రేవంత్ ప్రభుత్వం​ ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ దృష్టికి వచ్చిన అంశాలు, లోటు పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్.. ఆ మేరకు చాలా స్కీముల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశ పెట్టిన స్కీములన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్​ కాలేదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. విధివిధానాలు సరిగా లేకపోవడం, అవినీతి, బీఆర్ఎస్ నేతల జోక్యంతో అనర్హులకే ప్రయోజనం చేకూరిందని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ సారి అలా జరగకుండా ఉండేలా పథకాల్లో మార్పులు తేవలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

రైతు బంధులో కోట్ల రూపాయలు వృథా..
రైతుబంధు స్కీమ్ లోనూ వ్యవసాయేతర భూములు రియల్ ఎస్టేట్, రహదారులు, గుట్టలకు కూడా వేల కోట్లు గుమ్మరించడంతో ఆ స్కీమ్ అసలు లక్ష్యం నేరవేరలేదని రేవంత్ ఇప్పటికే పలు సమావేశాల్లో ప్రస్తావించారు. అలాగే వ్యవసాయం చేసే రైతులకు కాకుండా భూమి యజమానులకే రైతుబంధు అందడంపై కూడా కౌలు రైతులు ఆందోళన, అసహనం వ్యక్తం చేశారు. వందల ఎకరాలున్న వారందరికీ కోట్ల రూపాయలు ఇవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వీటితోపాటు రైతుబంధు సాకుతో విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలను కేసీఆర్ ప్రభుత్వ రద్దు చేయగా.. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల పంపిణీకూడా ఎత్తేసింది. దీంతో పేదలకోసం ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్ లో అనర్హులను గుర్తించి.. వారికి అందించే సొమ్మును వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గొర్రెల పంపిణీలోనూ మోసాలు..
ఇక గొర్రెల పంపిణీలోనూ డీడీలు కట్టిన గొల్లకుర్మలకు అన్యాయం జరిగిందని, స్వయంగా గొల్లకుర్మలు తమకు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ పథకం గొర్లు కాసుకునే వారికి మాత్రమే వర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటగా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్లకు, ఆ తర్వాత మిగతా అర్హులకు ఈ స్కీమ్ అందించేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

దళిత బంధు..
దళితబంధు స్కీంలోనూ భారీ అవకతవకలు జరిగినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు ఇచ్చారని, నిజమైన లబ్ధదారులకు ఒక్కరికి కూడా ఈ పథకం అందించలేదనే విమర్శలున్నాయి. దీంతో ఈ స్కీమ్ రూల్స్ లోనూ మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు, సిలిండర్, గృహ జ్యోతి, మహాలక్ష్మి, చేయూత, యువ వికాసం వంటి పథకాలు పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలు గ్రామాల్లో నిజమైన అర్హులను గుర్తించేందుకు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా నిబంధనల కోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డు, కల్యాణ లక్ష్మి..
రేషన్ కార్డులు​, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మి ఇతర వెల్ఫేర్​ స్కీముల్లోనూ పలు మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. లబ్ధిదారుల లిస్ట్​ అప్ డేట్ చేసి, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఈ పథకాలను అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మహిళా సంఘాలకు సంబంధించిన పథకాలు, లబ్ధిదారుల గుర్తింపులోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. స్టూడెంట్స్ కు సంబంధించి స్కాలర్ షిప్ లు తదితర స్కీమ్ లకు సంబంధించి విద్యావేత్తలు, ఐఏఎస్ ల  నుంచి సలహాలు తీసుకుని రూల్స్ ను రూపొందించనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు