Rythu Runa Mafi New Guidelines: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా సీఎం రేవంత్ లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేదఫాలో రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మహారాష్ట్ర తరహాలో..
మహారాష్ట్ర తరహాలో రైతు రుణమాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పంట రుణ మాఫీ చేసిన విధానంపై అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఏకకాలంలో రుణమాఫీ చేశాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. మహారాష్ట్రలో అధ్యయనానికి వెళ్లారు అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్‌లైన్స్ ఖరారు చేయనున్నారు. 2019లో రూ.2 లక్షల క్రాప్‌లోన్లు మాఫీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకు ఉన్న రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ వల్ల సర్కారుకు సుమారు రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్ల వరకు భారం పడనుందని అంచనా.