TG Govt School: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించనుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
2015, 2021 ఉత్తర్వుల ప్రకారం..
అయితే గత ప్రభుత్వం 2015, 2021 ఉత్తర్వుల ప్రకారం.. 0-19 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు, 61 నుంచి 90 మంది ఉన్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. కానీ తాజాగా ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి విద్యార్థుల బలాన్ని పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ పోస్టులను కేటాయించింది. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించనుంది. 11 నుంచి 40 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించనుంది.
అందుబాటులో వెబ్ ఆప్షన్లు..
విద్యార్థుల సంఖ్య 61 కంటే ఎక్కువ ఉన్న పాఠశాలల్లో టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు వెబ్ ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థుల సంఖ్య సున్నా లేని పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులు కేటాయించలేదు. ప్రస్తుతం ఉన్నదానితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను కూడా పెంచనుంది. గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయ వేయలేమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థుల కొరత కారణంగా పాఠశాలలు మూతపడ్డాయని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
ప్రతి గ్రామం, పల్లెల్లో విద్యా సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2,000 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది.