Telangana Congress: ఆ శాఖే కావాలి!.. పట్టు వీడని సీనియర్లు

డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు, ముఖ్య స్థానాల కోసం సీనియర్లు పట్టుబడుతుండడంతో ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పు ప్రక్రియలో కొంత ప్రతిష్టంబన ఏర్పడింది. వివిధ సమీకరణాల నేపథ్యంలో ప్రాధాన్యం లభిస్తుందని సీనియర్లంతా ఆశిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

New Update
Telangana Congress: ఆ శాఖే కావాలి!.. పట్టు వీడని సీనియర్లు

Telangana Congress Seniors: ఉట్టి డిప్యూటీ సీఎం పోస్టిస్తే ఏం చేసుకుంటాం! దాంతో పాటు మంచి పోర్ట్‌ఫోలియో ఇవ్వండి.. ఇదీ తెలంగాణలో తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government)లో స్థానం కోసం ఇప్పుడు సీనియర్లు పట్టుబడుతున్న అంశం. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్థానాలతో పాటు ప్రభుత్వ కూర్పుపై చర్చించడానికి కాంగ్రెస్‌ నాయకులు, వ్యూహకర్తలంతా హోటల్‌ ఎల్లాలో సోమవారం సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, పలువురు సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో డీకే శివకుమార్‌ సహా నలుగురు ముఖ్యులకు ఢిల్లీ నుంచి పిలుపు అందడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. కీలక శాఖలు, ముఖ్య స్థానాల కోసం సీనియర్లంతా సమావేశంలో డిమాండ్‌ చేసి, ఒకింత అసంతృప్తికీ లోనయ్యారట. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు శివకుమార్‌తో పాటు కీలక నేతలను అధిష్టానం ఢిల్లీకి రప్పించింది.

ఇది కూడా చదవండి: మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలంటున్నారు: జయరాం రమేశ్

ముఖ్యమంత్రి (Telangana CM) పదవికి సంబంధించి ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. అయితే, డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖల చుట్టే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయట. ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోల కోసం సీనియర్లంతా పోటీ పడుతుండడంతో కేబినెట్‌ కూర్పుపై ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యంగా హోం, ఎక్సైజ్‌, ఐటీ, విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, జల వనరుల శాఖల కోసం సీనియర్లంతా పట్టుబడుతున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker) పదవులకూ తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. వివిధ సామాజిక వర్గాలు, సమీకరణాల నేపథ్యంలో తమకు ప్రాధాన్యం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఆయా శాఖలపై ఎటూ తేల్చకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని సమాచారం.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగోలు.. ఆయన దిమ్మదిరిగే వ్యూహాలు ఇవే!

మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్లు అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. వారి వైఖరి అలా ఉండగా; మరోవైపు బీసీ కోటాలో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ డిప్యూటీ సీఎం పోస్టును డిమాండ్‌ చేస్తుండగా; తననొక్కడినే డిప్యూటీ సీఎంగా నియమించాలని భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారట. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మరో ముఖ్య శాఖ కోసం కూడా వారంతా డిమాండ్‌ చేస్తూ పట్టువీడడం లేదు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులను కూడా పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు ఆశిస్తుండడంతో వాటిపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన కాంగ్రెస్‌ అధిష్టానం మరో దఫా చర్చలకు నిర్ణయించింది.

#telangana-cm #batti-vikramarka #telangana-congress #deputy-speaker #dk-siva-kumar #telangana-pradesh-congress-committee
Advertisment
Advertisment
తాజా కథనాలు