దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్

బీఆర్ఎస్ కంచుకోటల నడుమ ఉన్న దుబ్బాకలో ఎలాగైనా మళ్లీ గెలవాలని రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డుతుండగా, వ్యూహాత్మకంగా తమకు కీలకమైన స్థానాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తాజాగా రఘునందన్ కు మద్దతుగా మందకృష్ణ ప్రచారం చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

New Update
దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్

Dubbaka: ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం దుబ్బాక. బీఆర్ఎస్ కు దుర్భేద్యమైన స్థానాలుగా ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు అతి సమీపంలో ఉన్న దుబ్బాక ఉపఎన్నికలో కమలం పాగా వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వల్ప ఆధిక్యంతోనే అయినా బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడంతోనే కమలదళంలో జోరు మొదలైంది. బీఆర్ఎస్ కు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మాటల మాంత్రికుడు రఘునందనరావు (Raghunandan Rao) మరోసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా; ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిని అధికార బీఆర్ఎస్ బరిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారు. ఈ దఫా కూడా గెలిచి తీరాలని రఘునందనరావు పట్టుదలతో ఉండగా; ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు కోల్పోవద్దని బీఆర్ఎస్ నిశ్చయించుకుంది. ప్రభాకరరెడ్డిపై దాడితో దుబ్బాక ఒక్కసారిగా మరోసారి రాష్ట్రస్థాయిలో వార్తల్లో నిలిచింది.  ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యే ఉన్నట్లు భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభావాన్నీ అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

ఇది కూడా చదవండి: రఘునందన్ ఎక్కడ? దుబ్బాక ఎందుకు దాటడం లేదు?

విజయం కోసం రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు పేరిట ఆయన ప్రచారంలో ముందుకెళ్తుండగా, ఏ అవకాశాన్నీ వదలుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేరు. మంత్రులు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రచారంలో విమర్శిస్తున్నారు. బీజేపీ ఈసారి కూడా ఒకే సీటుకు పరిమితం కావడం ఖాయమని హరీశ్ జోస్యం చెప్పగా; తాము తిరిగి అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములన్నింటికి పట్టాలిస్తామని ప్రచారంలో కేటీఆర్ హామీ ఇచ్చారు. రఘునందన్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయగా, పాటలను కూడా వదలకుండా కాంగ్రెస్ తమను కాపీ కొడుతోందని హరీశ్ సెటైర్లు వేశారు. దీనిపై రఘునందనరావు కూడా గట్టిగానే స్పందించారు. గత ఉప ఎన్నికలో హరీశ్ రావు మాదిరిగానే, ఈ సారి కేటీఆర్ ను పరుగెత్తించడం ఖాయమన్నారు. 173 ఓట్లతో గెలిచిన కేటీఆర్ వెయ్యి ఓట్లతో గెలిచిన తనను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డితో పాటు ఆ నాయకులపై ట్రాఫిక్ చలాన్లు ఎంతున్నాయో తెలుసా!

రఘునందన్ కు మందకృష్ణ మాదిగ మద్దతు:

రఘునందన్ రావును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని తాజాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో విశ్వరూప మహాసభ అనంతరం తెలంగాణ సామాజిక సమీకరణాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయన్న విశ్లేషణల నేపథ్యంలో మందకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సామాజిక న్యాయం మోదీతోనే సాధ్యమన్నారు మందకృష్ణ.

ఇదిలా ఉంటే, రాష్ట్రస్థాయి చరిష్మా ఉన్న రఘునందనరావు నియోజకవర్గానికే పరిమితమై మరీ గెలుపు కోసం శ్రమిస్తుండగా, సర్వశక్తులూ ఒడ్డి దుబ్బాక తమకు పక్కలో బళ్లెంగా మారకుండా చూసుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్.

Advertisment
Advertisment
తాజా కథనాలు