/rtv/media/media_files/2025/12/29/ai-2025-12-29-18-32-02.jpg)
2025లో కృత్రిమ మేధస్సు ఒక నిర్ణయాత్మక మలుపుకు చేరుకుంది. పరిశోధనల స్థాయి నుంచి రోజు వారీ సాధనగా మారిపోయింది. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఏఐను ఉపయోగిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ఏఐ కేవలం టెక్స్ట్, ఫోటోలకు మాత్రమే పరిమితం కాకుండా..పెద్ద పెద్ద సమస్యలను సైతం సాల్వ్ చేసే దిశగా ఎదిగింది. వైద్య రంగంలోనూ విపరీతమైన పురోగతిని సాధించింది. ఏఐ ఒక్కటి ఉంటే చాలు దేన్నైనా సాధించవచ్చనే నమ్మకాన్నిచ్చింది.
ఈ ఏడాది ఏఏఐకు సంబంధించిన మొదటి సంచలనం డీప్ సీక్. చైనా రూపొందించిన ఈ కృత్రిమ మేథ మోడల్ విపరీతమైన ప్రాచుర్యం పొందింది. అప్పటికే చాట్ జీపీటీ లాంటివి జనాల్లోకి చొచ్చుకుని పోయాయి. కానీ వాటన్నింటినీ తలదన్నేలా డీప్ సీక్ వచ్చింది. దీనికి కారణం ఇది అందరికీ అందుబాటులో ఉండడమే. డీప్ సీక్ R1 అంతకు ముందున్న మోడల్స్ ఆధిపత్యాలన్నింటినీ సవాల్ చేసింది. అత్యంత వేగంగా పెరిగి ప్రముఖ ఏఐ బెంచ్ మార్క్ లలో రెండవ స్థానంలో నిలిచింది. మిగతా మోడల్స్ లా కాకుండా డీప్ సీక్ అందరికీ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డెవలపర్లు, పరిశోధకులు దీనిని డౌన్ లోడ్ చేసుకోగలిగారు. దీంతో అందరూ డీప్ సీక్ ను ఎక్కువగా వాడడం మొదలెట్టారు.
మరింత లోతుగా ఏఐ..
2025లో ఏఐ చాలా అభివృద్ధి సాధించింది. అంతకు ముందు కేవలం మనమేమి అడిగామో దానిని మాత్రమే చెప్పేవి చాట్ బాట్ లు. కానీ ఈ ఏడాదిలో అవి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వీలు కల్పించాయి. ఎవరేమడిగా వేగంగా సమాధానాలు చెప్పడమే కాక..అంతర్గత తార్కికతను కూడా ఉత్పత్తి చేశాయి. అంటే..పాత ఏఐ మోడల్స్ చిన్న ప్రశ్నకైనా, పెద్ద ప్రశ్నకైనా ఒకేలా స్పందించేవి. కానీ కొత్తవి కష్టమైన సమస్య ఎదురైనప్పుడు, మనుషులలాగే కాసేపు ఆగి, అన్ని రకాలుగా ఆలోచించి సరైన పరిష్కారాన్ని చెబుతున్నాయి. ఇది క్లిష్టమైన లెక్కలు చేయడంలో, సైన్స్ పరిశోధనల్లో బాగా ఉపయోగపడుతోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కష్టమైన "ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్" వంటి పోటీల్లో ఈ ఏఐలు గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి చేరుకున్నాయి. మనుషులకే అర్థం కాని కొత్త కొత్త గణిత సూత్రాలను ఇవి కనిపెడుతున్నాయి.
భారీగా ఖర్చు పెడుతున్న కంపెనీలు..
ఇప్పుడున్నదంతా ఏఐ తరం. ఏ పని చేయాలన్నా దాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా ఏఐ పైనే దృష్టి పెడుతున్నాయి. దీనిపై కోట్లకు కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఏఐ అతి పెద్ద పరిశ్రమల్లో ఒకటిగా మారిపోయింది. కేవలం సాఫ్ట్‌వేర్ రాయడమే కాదు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల లాంటి డేటా సెంటర్లను నిర్మించడంపై కంపెనీలు పోటీ పడ్డాయి.
మనుషులతో ఎమోషనల్ బాండింగ్..
కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్లు ఇదంతా ఒక ఎత్తు అయితే..ఏఐ అంతకు మించి ఎదిగిపోయింది. ఇంతకు ముందు వరకు ఎంత కంప్యూటర్ తో పని చేసినా అది కేవలం ఒక యంత్రం అనే స్పృహతోనే ఉండేవారు. కానీ ఏఐ దాన్ని దాటుకుని వెళ్ళిపోయింది. మునుషులతో ఎమోషనల్ బాండింగ్ ను బిల్డప్ చేసుకుంటోంది. 2025 లో జరిగిన అతి ముఖ్యమైన మార్పుల్లో ఇది ఒకటి. దీనివల్ల మనుషులకు, యంత్రాలకు మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. మనుషులను అర్థం చేసుకుంటూ ఏఐ మాట్లాడుతోంది. దీని వలన కొన్ని చెడు సంఘటనలు కూడా జరిగినప్పటికీ..చాలా మట్టుకు మంచే చేసిందని చెబుతున్నారు.
సర్వసాధారణం అయిపోయింది..
2025లో టెక్నాలజీ ప్రపంచంలో వచ్చిన మరో అతిపెద్ద మార్పు ఏమిటంటే, AI అనేది మనం విడిగా వాడుకునే ఒక యాప్ లా కాకుండా, మన ఫోన్, కంప్యూటర్లలో ఒక భాగం అయిపోయింది. మనం వాడే ప్రతీ దానిలో ఏఐ ఒక పార్ట్ అయి వచ్చేస్తోంది. ఇవే కాదు ఈ ఏడాదిలో ఏఐ ఇంకా చాలా విప్లవాత్మకమైన మార్పులనే సాధించింది. గతంలో మన ఫోన్లలో ఉండే వాయిస్ అసిస్టెంట్లు అలెక్సా, సిరి లాంటివి కొంచెం రోబోలా, యాంత్రికంగా మాట్లాడేవి. కానీ అవి ఇప్పుడు మనలాగే అంటే మనుషుల్లాగే మాట్లాడుతున్నాయి. టైప్ కూడా చేసే శ్రమ లేకుండా కేవలం మాటలతోనే పని చేస్తున్నాయి. ఇదంతా ఏఐ చేసిన మాయే. అలాగే ఇప్పుడున్న ఏఐ కేవలం మనమేది అడిగితే అది మాత్రమే చేయడం లేదు. దానికి సంబంధించి లోతుగా విశ్లేషిస్తోంది. ఉదాహరణకు ఒక ప్రదేశానికి సంబంధించి అడిగామనుకోండి...దాని గురించి చెప్పడంతో పాటూ..అక్కడికి ఎలా వెళ్ళవచ్చు, ఏం చూడొచ్చు, హోటల్స్ లాంటి సమాచారాన్ని కూడా ఇచ్చేస్తోంది. మొత్తం మన టూర్ అంతటినీ ప్లాన్ చేసేస్తోంది.
మొత్తానికి 2025లో ఏఐ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒకటని ఏంటి అన్ని రకాలుగా మనుషులకు తోడుగా ఉంటూ మంచి, చెడు అన్నింటిలోనూ పాలుపంచుకుంటోంది.
Follow Us