AP Elections 2024: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి.. ఏపీలో రాజకీయాలు ఫుల్ హై స్పీడ్ లో ఉన్నాయి. అయితే, ఇటు టీడీపీలోనూ.. అటు వైసీపీలోనూ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ప్రసంగాల్లో పంచ్ లు వేస్తున్నారు. అసలు ఎందుకు అందరూ పవన్ మీదే పడుతున్నారు? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే! By KVD Varma 03 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Target Pawan Kalyan: ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. నేరుగా చూస్తే రెండు పార్టీల మధ్య పోరులా అనిపిస్తుంది. కానీ, ఈ రెండు పార్టీలు ఎవరినో టార్గెట్ చేసుకున్నట్టుగా వ్యవహరిస్తాయి. ఆ ఎవరో అందరికీ తెలిసిందే. అవును.. పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాల్లో ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ పేరు మోగాల్సిందే. అది మంచి అయినా చెడు అయినా సరే. ఎన్నికల సమయం అనే కాదు.. ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల టార్గెట్ పవన్ కళ్యాణ్ అవుతూ ఉంటారు. సరిగ్గా గమనిస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (Janasena Party) పెట్టి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో పవన్ వెనుక ఎందరో తిరిగారు.. దేవుడు అన్నారు.. మళ్ళీ వారిలో చాలా మంది అబ్బే.. ఆయన రాజకీయాలకు పనికిరాడు అంటూ పక్కకి జరిగిపోయారు. జనసేన పార్టీ మీద కాపు కులం ముద్ర వేసి.. కేవలం కాపుల ఓట్లు ఆ పార్టీకి దన్నుగా ఉంటాయని భావించే టీడీపీ (TDP), వైసీపీ (YCP) రెండూ రాజకీయాలు చేస్తూ వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ కులమే ఆయనకు శాపంగా మారినట్టు కనిపిస్తోంది. తాజా ఉదాహరణే తీసుకుందాం.. టీడీపీ తో పొత్తుతో ఈ ఎన్నికల్లో వెళ్లాలని జనసేనాని డిసైడ్ అయ్యారు. ముందు ఈ రెండు పార్టీల పొత్తు విషయంలోనే కొంత వ్యతిరేకత కనిపించింది. ఆ తరువాత సీట్ల పంపకాల దగ్గరకు వచ్చాకా పవన్ కళ్యాణ్ ను విమర్షించని నాయకుడు లేడు. 24 సీట్ల కోసం జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టేశాడు.. కాపులను చంద్రబాబు (Chandrababu) కాళ్లదగ్గర పడేశాడు లాంటి తీవ్ర వ్యాఖ్యలు కాపు నాయకులు అందరూ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. టీడీపీ లో చాలామంది పవన్ కళ్యాణ్ తో పొత్తు అవసరమే లేదు.. ఎదో ఆయన వచ్చాడు కాబట్టి పొత్తుకు చంద్రబాబు ఒప్పుకున్నారు. 24 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అంటూ నసుగుతున్నారు. ఇక.. అధికార వైసీపీ అయితే.. ఈ 24 సీట్ల అంశంతోనే పవన్ ను చెడుగుడు ఆడిస్తోంది. కాపు వర్గంలో రాజకీయ చిచ్చు పెట్టడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా దుయ్యపడుతూ వస్తోంది. అసలు పొత్తు అనేది రెండు పార్టీల మధ్య అంశం. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది ఆ పార్టీల నాయకులు.. నేతలు.. తేల్చుకుంటారు. కానీ, వైసీపీ ఈ అంశాన్ని ఎక్కువగా తెరమీద ఉంచే ప్రయత్నం చేస్తోంది. సరే సీట్లు.. సర్దుబాట్లు.. అలకలు.. పక్క పార్టీల విమర్శలు పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్(Target Pawan Kalyan) ని తిట్టని నాయకుడు.. ఆయన మీద విరుచుకుపడని నేతలు ఒక్కరైనా వైసీపీలో ఉన్నారా? ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా.. అందరూ ప్రతి సందర్భంలోనూ అవసరం ఉన్నా.. లేకున్నా.. పవన్ మీద విరుచుకు పడుతూనే ఉన్నారు. అసలు వైసీపీ పోటీ పడుతోంది టీడీపీ తోనా లేకపోతే పవన్ తోనా అనేది ఒక్కోసారి ఎవరికీ అర్ధంకానంత దారుణంగా ఆ పార్టీ నాయకుల మాటలు ఉంటున్నాయి. ఇది చూస్తే వైసీపీకి టీడీపీ కంటే, జనసేనాని పవన్ అంటేనే భయం ఎక్కువగా ఉన్నట్టు ప్రజలు అనుకుంటే అది వారి తప్పు కాదు. ఇక టీడీపీ నాయకులు కూడా.. ఇప్పుడంటే, పొత్తు ధర్మం అని నోరు కట్టేసుకున్నారు కానీ, మొదట్నుంచీ పవన్ పై చీటికీ మాటికీ చికాకు పడిన వారే. ఇక్కడ రెండు పార్టీలు రాజకీయం కోసం వారి మధ్యలో ఓట్లు చీలకుండా పవన్ ను పక్కకు తప్పించాలనే వ్యూహంతో ఉన్నాయని అనుకోవచ్చు. కానీ, పవన్ సామాజిక వర్గ నేతలు కూడా పవన్ నే టార్గెట్ చేయడం విచిత్రం. పవన్ పార్టీ కాపుల కోసమే పెట్టానని ఎప్పుడూ చెప్పలేదు. పోనీ చెప్పారని అనుకుందాం.. అప్పుడు ఇష్టమైన వారు ఆయన వెంట నడవ వచ్చు.. లేదంటే వారి దారిన వారు పోవచ్చు. కానీ. టీడీపీలోని కాపు నాయకులూ.. వైసీపీలో కాపు నేతలు ఇష్టం వచ్చినట్టు పవన్(Target Pawan Kalyan) ను తూలనాడుతూ వస్తున్నారు. ఇక తటస్థంగా ఉన్న కాపు నేతలు.. అప్పుడప్పుడు మాత్రమే తమ సామాజిక వర్గం గుర్తుకువచ్చే పార్ట్ టైం పొలిటీషియన్స్.. రిటైర్మెంట్ తీసుకుని గోళ్లు గిల్లుకోవడం విసుగు వచ్చి సామాజిక వర్గం గురించి బాధపడే నేతలు.. వీళ్లంతా కూడా పవన్ ను టార్గెట్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. Also Read: టార్గెట్ పవన్.. వైసీపీ స్కెచ్ అదిరింది.. మరి ఓటర్లు ఎవరి కాపు కాస్తారు? జనసేన పార్టీ రెండు ఎన్నికలు చూసింది. ఒకసారి ఎన్నికల్లో నిలబడకుండా టీడీపీకి సపోర్ట్ గా నిలబడింది. రెండోసారి ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటుతో చతికల పడింది. పార్టీకి వచ్చిన ఓట్ల శాతం లెక్కలు ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే, కావలసింది అసెంబ్లీలో ప్రాతినిధ్యం. అది జనసేనకు దక్కలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయి అవమాన పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ టార్గెట్ గా రాజకీయాలు కొనసాగుతూ ఉండటం విచిత్రంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇది సరిగ్గా సరిపోతుందో లేదో తెలీదు కానీ, ఏప్రిల్ 1 విడుదల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నిజం చెబితే ఒకరు కొడతారు.. అబద్ధం చెబితే ఇంకోరు కొడతారు.. దీంతో ‘’నేనేం చెప్పినా తప్పైపోతోందేంటండీ’’ అని వాపోతాడు. ఇప్పుడు పవన్ పరిస్థితి అదెలా కనిపిస్తోంది. కానీ, ఒక్కటి మాత్రం నిజం. పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు విషయం ఉంది కాబట్టే పవన్ ని తొక్కేసేందుకే వైసీపీ, టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఎవరైనా అనుకుంటే అది కరెక్ట్ అని చెప్పవచ్చు. టీడీపీతో జనసేన క్యాడర్ పూర్తి స్థాయిలో కలిసి పనిచేస్తే వైసీపీకి అవకాశం కచ్చితంగా ఉండదు. జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చి తన స్థాయిని పెంచేస్తే.. రేపు అధికారంలోకి వస్తే పక్కలో బల్లెంలా పవన్ తయారు అవుతాడేమో అనే భయం టీడీపీ నాయకుల్లో ఉంది. ఏది ఏమైనా.. ఇన్ని అవమానాల మధ్య పవన్ కళ్యాణ్రా జకీయాలు కొనసాగించడం.. చాలావరకూ తగ్గుతూ ఉండటం వెనుక కారణాలు ఏమైనా.. పవన్ కళ్యాణ్ ని అందరూ టార్గెట్ చేయడం మాత్రం చాలా.. చిత్రంగా ఉంది. ఒక్క కులనాయకుడిగా పవన్ ఎదిగే ప్రయత్నం చేయడం లేదనే విషయం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. బహుశా అదే ఇప్పుడు అందరి భయం ఏమో! - KVD వర్మ #pawan-kalyan #ycp #tdp #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి