నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా రేట్లు తగ్గుతున్నాయి. శుక్రవారం నాడు మార్కెట్ కు 400 టన్నుల టమాటా వచ్చింది. దీంతో మొదటి రకం టమాటాలకు కిలో రూ.30-40 నుంచి పలికింది.
రెండవ రకం టమాటాలు కిలో రూ.21-28 మధ్య పలికాయి.అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో టమాటా దిగుబడులు పెరగడంతో టమాటా ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం టమాటాలు కిలో రూ.200 కు పైనే పలికింది. దీంతో కొంతమంది టమాటా రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు.
కానీ వినియోగదారులు మాత్రం టమాటాలను కొనడమే మానేశారు. తాజాగా టమాటా ధరలు తగ్గుతుండడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తుంటే రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. టమాటా ధరలు భారీగా పెరుగుతుండడంతో మదనపల్లెకు చెందిన చాలా మంది రైతులు టమాటా పంటను సాగుచేశారు.
దీంతో పంట దిగుబడి బాగా వచ్చింది. టమాటా సాగు పెరగడంతో మార్కెట్ లో టమాటా ధర పడిపోయింది. పది రోజుల క్రితం కిలో టమాటా రూ. 200 వరకు ఉండగా... శుక్రవారం రోజు రూ.30 వరకు పడిపోయింది. మార్కెట్ లో బయ్యర్లు లేకపోవడంతో డిమాండ్ అమాంతం తగ్గింది.
ఈ నెల మొదట్లో కూడా కిలో 200 లు పలికిన టమాటా ధరలు..పది రోజుల్లోనే 30 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న గరిష్ఠ ధర రూ.64 కాగా కనిష్టంగా రూ.36కు చేరింది. ఇక ఈ రోజు మరింత తగ్గి గరిష్ఠంగా రూ.40, కనిష్ఠంగా రూ.30 పలికింది.