Cyclone Michaung Effect: మిచౌంగ్ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని అతలాకుతలం అవుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పోర్లతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్డు ఎక్కడ ఉందో నది ఎక్కడో ఉందో తెలియడం లేదు.
ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను అధికారులు రద్దు చేశారు.
రాష్ట్రం నుంచి బయటకు వెళ్లే కొన్ని రోడ్డు మార్గాలు కూడా వర్షాల కారణంగా మూసివేసినట్లు అధికారులు వివరించారు. రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. వరద బీభత్సంగా పడుతుండడంతో మీనంబక్కం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విమానాశ్రయాధికారులు ప్రకటించారు.ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభించి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికే 70 కి పైగా విమాన సర్వీసులను రద్దు చేయగా..మరో 33 సర్వీసులను బెంగళూరు వైపు దారి మళ్లించారు. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో తుఫాన్ ఎఫెక్ట్ బాగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వర్ష బీభత్సం బాగా ఉన్న జిల్లాలు అన్నిటిలోనూ స్కూళ్లకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడానికి అనుమతినివ్వాలని ప్రైవేట్ సంస్థలను కోరారు. ఇప్పటికే కొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణియన్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
చెన్నై, చుట్టుపక్కల ఉన్న చాలా ఫ్యాక్టరీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ, చెన్నై, పరిసర జిల్లాలలో ప్రస్తుతం ఉన్న తుఫాను పరిస్థితుల కారణంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా యొక్క శ్రీపెరంబుదూర్ యూనిట్‌లోని ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం గురించి కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి కనుక్కున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని సీఎంలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించామని, అవసరమైతే మరిన్ని బృందాలను పంపుతామని తెలిపారు.
Also read: మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు