Indigo Airlines : భారతదేశానికి చెందిన ఇండిగో(Indigo) ఎయిర్‌లైన్ మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ $17.6 బిలియన్లకు (సుమారు ₹1.47 లక్షల కోట్లు) చేరుకుంది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను వెనక్కి నెట్టి ఇండిగో ఈ స్థానాన్ని సాధించింది. ఈ గ్లోబల్ ఎయిర్‌లైన్స్(Global Airlines) జాబితాలో US-ఆధారిత డెల్టా ఎయిర్‌లైన్స్ మొదటి స్థానంలో ఉంది. దీని మార్కెట్ క్యాప్ $30.4 బిలియన్లు (దాదాపు ₹2.53 లక్షల కోట్లు). ర్యాన్ ఎయిర్ హోల్డింగ్స్ 26.5 బిలియన్ డాలర్ల (₹ 2.16 లక్షల కోట్లు) మార్కెట్ క్యాప్‌తో రెండో స్థానంలో ఉంది.
గతేడాది 14వ స్థానంలో ఇండిగో..
గత ఏడాది మార్చిలో మార్కెట్ క్యాప్ పరంగా గ్లోబల్ ఎయిర్‌లైన్స్ జాబితాలో ఇండిగో(Indigo) 14వ స్థానంలో ఉంది. ఇండిగో డిసెంబర్ 2023లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను అధిగమించింది. ఈ ఏడాది జనవరిలో ఎయిర్ చైనాను, ఫిబ్రవరిలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను అధిగమించింది.
Also Read: వేసవి సెలవుల్లో విమాన ఛార్జీల మోత మోగుతుంది!
కంపెనీ షేర్లు 6 నెలల్లో 50%పెరిగాయి..
గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 102.55% రాబడిని ఇచ్చాయి. ఇది గత 6 నెలల్లో 50.25%, ఒక నెలలో 18.25%గా ఉంది. ఈ సంవత్సరం జనవరి 1 నుండి 27.78% పెరిగింది. ఏప్రిల్ 10న 4.73% లాభంతో రూ.8,306 వద్ద ముగిసింది.
భారత విమానయాన మార్కెట్లో 60% వాటా..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, భారతదేశ విమానయాన రంగంలో ఇండిగో(Indigo) 60.2% వాటాను కలిగి ఉంది. ప్రయాణీకుల సంఖ్య పరంగా ఎయిర్ ఇండియా రెండవ స్థానంలో ఉంది. దాని వాటా 12.2%. అయితే, టాటా గ్రూప్ కింద నడుస్తున్న ఎయిర్‌లైన్స్ అన్నిటి మొత్తం వాటా 28.2%.
అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారీ లాభం..
భారతదేశం(India) లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో అంటే Q3FY24లో ఇండిగో నికర లాభం సంవత్సరానికి 110.7% పెరిగి ₹2,998 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇండిగో రూ.1,422.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 30.26% పెరిగి రూ.19,452 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.14,933 కోట్లు. మూడవ త్రైమాసికంలో టికెట్ విక్రయాల ద్వారా కంపెనీ ₹17,157 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 30.30 శాతం వృద్ధి నమోదైంది.
రెండవ త్రైమాసికంలో, ఇండిగో(Indigo) ₹189 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా రెండవ త్రైమాసికంలో ఏవియేషన్ కంపెనీ లాభాలను ఆర్జించడం 5 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ త్రైమాసికం ఏవియేషన్ పరిశ్రమకు బలహీనమైన డిమాండ్ ఉన్న సీజన్‌గా పరిగణిస్తారు.