AP News: ఏపీలో ప్రభుత్వ మార్పిడితో వరుస రాజకీయ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిస్తే.. తాజాగా అనంతపురం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను చంపేందుకు కుట్ర జరుగుతోదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
ఈ మేరకు మంగళవారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం దాడులకు దారితీసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మూడు నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా.. కేతిరెడ్డి ఇంటిపై పలువురు దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళీ ఇంటికి నిప్పంటించారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో తాడిపత్రి వాతావరణం రణరంగంగా మారగా.. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
‘పక్కా ప్లాన్ ప్రకారమే నన్ను చంపేందుకు జేసీ ప్రభాకర్ ప్రయత్నిస్తున్నారు. నేను తాడిపత్రికి రాకూడదని దౌర్జన్యం చేస్తున్నారు. జిల్లాల్లో ఆయనకు రాజకీయంగా అడ్డొస్తాననే భయంతోనే దాడులు చేస్తున్నారు. మా అన్నను కూడా గతంలో ఇలానే హత్య చేసి చంపేశారు. నన్ను తాడిపత్రికి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. నా ఊపిరి ఉన్నంతవరకు తాడిపత్రిలోనే ఉంటా.. ఎస్పీ అనుమతితోనే తాడిపత్రికి వచ్చాను’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.