Sweeper Story: ఉత్తరప్రదేశ్‌లో గోండా జిల్లాకు చెందిన సంతోష్ జైస్వాల్ అనే స్వీపర్ కథ ఇది. మున్పిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసే ఇతను చాలా తక్కవు సమయంలోనే కోట్లకు పడగలెత్తాడు. కోట్ల రూపాయల నగదు, ఆస్తులు, లగ్జరీ కార్లు ఇప్పుడు ఇతని సొంతం. సంతోష్ ఆస్తులు చూసి పక్కనున్నవారే కాదు అధికారుల సైతం నోర్లెళ్ళబెడుతున్నారు. ఇతను ఇంత తొందరగా అన్ని డబ్బులు ఎలా సంపాదించాడంటే…సంతోష్ అందరిలానే మున్సిపల్ కార్మికుడిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత తన తెలివితేటలన్నీ ఉపయోగించి, పైరవీలు చేసి మున్సిపాలిటీ నుంచి డివిజనల్ స్థాయికి వెళ్ళాడు. అక్కడ తన మొత్తం టాలెంట్‌ను బయటకు తీశాడు. లంచాలు తీసుకుంటూ…అక్రమాలు చేస్తూ…ఫైళ్లను మారుస్తూ అడ్డదిడ్డంగా డబ్బులు కూడేశాడు. అందినకాడికి దోచుకున్నాడు. ఇలా కోట్లలో నగదు, ఆస్తులు, కార్లు కూడబెట్టాడు. చివరికి అతడి బాగోతం బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చెత్త ఊడ్చే కార్మికుడికి ప్రమోషన్ రావాలంటే అదో పెద్ద విషయం. అది కూడా డివిజనల్ స్థాయిలో అంటే ఇంకా కష్టమైన విషయం. అలాంటిది సంతోష్ నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్‌గా ప్రమోషన్ పొందాడు. ఈ క్రమంలో డివిజనల్ కమిషనర్ ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేయడం.. తద్వారా డబ్బులు వెనకేసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఫైళ్లు తారుమారు చేసి.. ఏకంగా రూ.కోట్లలో ఆస్తులను సంపాదించాడు. డివిజల్ ఆఫీసులో కూడా అతను చేసే పని చెత్త ఊడ్వడమే. అయితే అక్కడి అధికారుల కింద పైరవీలు చేస్తూ బాగా డబ్బులు మాత్రం సంపాదించాడు. ప్రస్తుతం ఇతని గుట్టురట్టు అయింది. డివిజనల్ కమిషనర్‌కు కంప్లైంట్ వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఫైళ్ల తారుమారు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై కమిషనర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో అతడి స్వీపర్ ఉద్యోగం కాస్తా ఊడింది. సంతోష్ జైస్వాల్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Also Read: International: షిప్ మునక..బ్రిటన్ వ్యాపారవేత్త గల్లంతు