దీపావళి నాడు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు గురించి చాగంటి కోటేశ్వరరావు వివరించారు. ఆచార వ్యవహారాలు అనేవి శాస్త్రం చేత చెప్పబడినట్లు ఆయన వివరించారు. తనతో పాటు అందరూ బాగుండడానికి పెట్టినవే ఆచార వ్యవహారాలు. దీపావళి నాడు తెల్లవారుజామునే తైలాభ్యంగన స్నానం ఆచరించాలి.
కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు లేదా ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుని పెద్దలకు నమస్కరించుకోవాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రమాదకరమైనటు వంటి వాటి దగ్గరకు వెళ్లకుండా ఉండటం, దీపాలు పెట్టడం, వాతావరణానికి కాలుష్యం కలిగించనటువంటి వాటినే బాణసంచాగా కాల్చాలి.
పండుగ అనేది తన కోసం మాత్రమే కాదు..అందరి కోసం. కాబట్టి పాటించే నియమాలు అన్ని కూడా తన అభ్యున్నతితో పాటు..సమాజ అభ్యున్నతికి పాటు పడాలి. అందుకోసం ఉత్తరేణిని వేళ్లతో సహా పెకిలించి పూజించాలి. ఉత్తరేణి ఉన్న చోట క్రీములు, రోగాలు అనేవి ఎప్పుడూ కూడా దరి చేరవు.
అందుకే పూజ సమయంలో కూడా ఉత్తరేణికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం రోజుల్లో ఉత్తరేణి వేరుతో దంతావదానం చేసేవారు. ఆ వేరు నోటిలో ఉన్న సూక్ష్మ క్రిములన్నింటిని చంపేది. భూమి లోపల ఎంత వరకు వేరు విస్తరిస్తుందో అక్కడ వరకు ఎలాంటి క్రిమి కీటకాలను రాకుండా అడ్డుకుంటుంది.
అందుకే చాలా మంది ప్రజలు ఉత్తరేణిని తమ ఇంటికి తీసుకుని వచ్చి గుమ్మం వద్ద ఉంచుతారు. దీపావళి నాడు స్నానం చేసే ముందు ఉత్తరేణిని తల పై మూడు సార్లు తిప్పుకుంటారు. ఆ తరువాత దానిని బయటపడేయడం వల్ల అది భూమి లోపల పరుచుకోవడంతో పాటు..క్రిమికీటకాలను దరిదాపులకు రానివ్వదు. అలాగే ప్రేత చతుర్దశి నాడు పితృదేవతలు వచ్చి వెళ్తుంటారు కాబట్టి ..వారికి దీపావళి నాడు దక్షిణ దిక్కుకు తిరిగి దివిటిని చూపించాలి.
మన పుట్టుకకు కారణం అయినటువంటి ముందు తరాల వారి పట్ల కృతజ్ఙత అనేది ఉండాలి. అలా గుర్తు చేసుకుని సమాజంలో ప్రయోజనాత్మకంగా జీవించాలి. ఇవన్నీ తెలుసుకుని ఆచార వ్యవహారాలను పాటిస్తూ జీవించాలి. అంతే తప్ప ఆచారవ్యవహారాలు అనేవి గిరి గీసుకుని బతికేవి కావు.