వివాదస్పద జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque)లోని వాజూఖానా ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతించింది. ఈ ప్రాంతంలోనే శివలింగం కనిపించినట్లు చెబుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు అనుమతించడం గమనార్హం. వాజూఖానా ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో శుభ్రం చేసేందుకు అనుమతించాలంటూ హిందూ మహిళా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.
హిందూ మహిళా భక్తుల తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పిటిషన్ దాఖలు చేశారు. హిందువులకు శివలింగం పవిత్రమైనదని, మురికి, దుమ్ము, చనిపోయిన జంతువులు తదితరాలకు దూరంగా ఉంచుతామని, వాటర్ ట్యాంకులోని చేపలు చనిపోయి అందులోంచి దుర్వాసన వస్తోందని ఆ పిటిషన్‌లో జైన్ పేర్కొన్నారు. అందువల్ల దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ వాదనలు వినిపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేపీ పర్డివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారంనాడు విచారణ జరిపింది. అనంతరం సుప్రీంకోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా వారణాసి జిల్లా సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వాజూఖానా (వాటర్ ట్యాంక్)ను శుభ్రం చేసేందుకు కోర్టు అనుమతించింది.
కాగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ కూడా అంగీకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మూలంగా రెండేళ్లుగా వాటర్ ట్యాంక్ సీల్ వేసి మూసివేసి ఉందని, అందువల్ల ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారిందని తెలిపింది.ట్యాంకును శుభ్రం చేసేందుకు తాము కూడా సుముఖంగానే ఉన్నామని విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే వాజూఖానా సీల్ వేసే సమయంలో అందులోని చేపలను తరలించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ అభ్యర్థించారని, కానీ అంజుమాన్ ఇంతెజామియా మసీదు మేనేజిమెంట్ కమిటీ ఆ పని చేయకపోవడం వల్ల చేపలు చనిపోయాయని దానికి కమిటీదే బాధ్యత వహించాలని పిటిషనర్ వాదించారు.
జ్ఞానవాపి మసీదులోని వాజూఖానా ప్రాంతంలో 2022 మేలో శివలింగం కనిపించింది. అయితే అది శివలింగమని హిందూ వర్గాలు, ఫౌంటేన్ అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో వాజూఖానా ప్రాంతాన్ని సీల్ చేశారు.