సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రజనీకాంత్ తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టింది. ఈ మధ్యే విడుదల చేసిన కావాలి అనే పాటు యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా తమన్నా స్టెప్పులపై నెటిజన్లు రీల్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 10న విడుదలకు సిద్ధం అవుతుండటంతో ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. ఈ మధ్య జరిగిన ఈవెంట్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజకీయాలపై రజనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు రజనీ కాంత్ .
రజనీకాంత్ మాట్లాడుతూ.. "నేను మద్యానికి బానిస కాకుండా ఉంటే సమాజానికి మంచి పని చేసి ఉండేవాడిని. కెరీర్‌పై దృష్టి పెట్టేవాడిని. మద్యం సేవించడం నా జీవితంలో పెద్ద తప్పు, నేను మద్యానికి బానిస కాకుండా ఉంటే.. సమాజ సేవ చేసేవాడిని. ఇప్పుడున్న పొజిషన్ కంటే మంచి స్థాయిలో ఉండేవాడిని. మద్యం మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ సభ్యుల సంతోషాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. అలాగని మద్యం తాగవద్దని చెప్పడం లేదు..ఎప్పుడైనా ఒకసారి తాగండి..రోజు మాత్రం అలవాటు చేసుకోవద్దంటూ చెప్పారు సూపర్ స్టార్ రజనీ కాంత్. కాగా ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేశారు సూపర్ స్టార్. కానీ ఆరోగ్యకారణాలతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.
ఇప్పుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల గురించే కావచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. మద్యం అలవాటు లేకుండా ఆరోగ్యం బాగుంటే రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవాడినని రజనీ కాంత్ చెప్పకనే చెప్పారా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లలేకపోయాననే అసంతృప్తి ఆయనలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే మంచి స్థాయిలో అంటే సీఎం పదవేనా అని అనుకుంటున్నారు.
కాగా ఆగస్ట్ 10న ఈ సినిమా విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్ పాత్రను పోషించారు. రజనీకాంత్‌తో పాటు తమన్నా భాటియా, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్, యోగి బాబు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీకాంత్ సినిమా ‘లాల్ సలామ్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
2019లో విడుదలైన 'పెట్టా' సినిమాలో రజనీకాంత్ సిగరెట్ తాగుతూ కనిపించారు. అలాగే 2018లో విడుదలైన 'కాలా' సినిమాలోని ఓ పాటలో మద్యం సేవిస్తూ కనిపించాడు. ఈ అలవాటు సినిమాలో అతని భార్య మరణానికి దారితీసింది. రజనీకాంత్ తెరపై ధూమపానాన్ని ప్రచారం చేయడం మానేశాడు.