Telangana: రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం !

త్వరలో 'తెలంగాణ మనీ లెండర్స్‌ యాక్ట్‌'ను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల అప్పులు తీసుకునే రైతులకు వడ్డీ భారం తగ్గనుంది.

New Update
Telangana: రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం !

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఓ చట్టాన్ని అమలుచేసేందుకు రేవంత్ సర్కార్‌ సిద్ధమవుతోంది. అప్పులు తీసుకునే రైతులపై అధిక వడ్డీ భారం పడకుండా అడ్డుకునేందుకు 'తెలంగాణ మనీ లెండర్స్‌ యాక్ట్‌'ను అమలు చేయనుంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లైతే.. రుణ దాతలందరూ కూడా క్రమం తప్పకుండా తమ లైసెన్స్‌లను పునరుద్దరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవలం 30 శాతం రైతులు మాత్రమే సంస్థాగత ఫైనాన్సింగ్ (బ్యాంకుల నుంచి రుణాలు) పొందడానికి అర్హులయ్యారు. మిగతా రైతులందరూ రుణాల కోసం ప్రైవేట్‌ రుణ దాతలపై ఆధారపడుతున్నారు. ఇందుకోసం వాళ్లకి 48 శాతం వరకు వడ్డీ కడుతున్నారు. దీంతో రైతులకు వడ్డీ కట్టడం పెను భారంగా మారింది.

Also Read: జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్‌ రాఠీ

అయితే ఈ చట్టాన్ని నిజాం కాలంలోనే (1339) మొదటగా రూపొందించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మళ్లీ తెలంగాణలో  ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. మనీ లెండర్స్‌ చట్టం ప్రకారం.. ప్రజల నుంచి ఎవరైతే అధికంగా వడ్డీ వసూలు చేస్తారో వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. వాళ్లపై కేసులు బుక్ చేయడం, వాళ్ల లైసెన్స్‌ను పర్యవేక్షించడం వంటి అధికారాలు ఎక్కువగా కలెక్టర్లకు ఉంటాయి.  ఈ చట్టం మాత్రం ప్రస్తుతం అమలు కావడం లేదు. అయితే కమర్షియల్ బ్యాంకులు వ్యవసాయ రుణాలపై 7 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.  కమర్షియల్ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్ల కన్నా 2 శాతం ఎక్కువగా ప్రైవేటు రుణదాతలు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంపై రెవెన్యూ శాఖతో చర్చలు జరిగాయి. త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రుణదాతలు వీటిపై రిజిస్టర్ చేసుకోవడం, వాళ్లకి లైసెన్స్‌లు జారీ చేయడం అలాగే వాటిని పునరుద్ధరించడం వంటి విధానాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. గ్రామాల్లో చాలా మంది రుణదాతలు రైతులకు అప్పిచ్చి అధికంగా వడ్డీ వసూలు చేస్తూన్నారని.. ఈ కారణం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు స్వరాజ్య వేదిక సభ్యుడు రవి కన్నెగంటి అన్నారు. అలాగే రుణదాతలు కూడా చాలామంది రాజకీయాల్లో ఉండటం వల్ల.. ఈ మనీ లెండర్స్ చట్టాన్ని ఏపీలో గాని, తెలంగాణలో గాని అమలు చేయడం అంత సులువు కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: త్వరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉపఎన్నిక: కేటీఆర్‌

ఇదిలాఉండగా.. చాలా రాష్ట్రాలు ఈ మనీ లెండర్స్‌ యాక్ట్‌ను తీసుకొచ్చినప్పటికీ దీన్ని అమలు చేయడం చేయడం మాత్రం సమస్యాత్మకంగా మారింది. ఈ ఏడాది గుజరాత్‌లో వడ్డీ ఎక్కువగా వసూలు చేసే వారిపై ఈ చట్టం ప్రకారం కేసు నమోదైంది. పోలీసులు 130పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీళ్ల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లందరూ కూడా మధ్య తరగతి, తక్కువ ఆదాయం ఉన్నవారే ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు