/rtv/media/media_files/2025/08/13/raina-2025-08-13-06-54-25.jpg)
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. న్యూ ఢిల్లీలోని హెడ్ ఆఫీసులో రైనాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో భాగంగా సురేశ్ రైనా పాత్ర, ఈ బెట్టింగ్ యాప్‌తో ఆయనకున్న సంబంధాలు, ప్రచారం కోసం అందుకున్న పారితోషికం వంటి విషయాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్‌కు సురేష్ రైనా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
🚨Cricketer Suresh Raina has been summoned on Wednesday by the Enforcement Directorate (ED) at its Delhi office in connection with an probe into betting platforms
— Hindustan Times (@htTweets) August 12, 2025
More details 🔗 https://t.co/zVHiQFV495pic.twitter.com/89N7Twb8ks
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ దేశంలో పనిచేయడం చట్టవిరుద్ధమని ED పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి పలువురిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి మోసగించారని, మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిపారని ఈడీ ఆరోపిస్తోంది.
నేడు ఈడీ విచారణకు మంచు లక్ష్మి
ఇదే కేసులో నేడు నటి మంచు లక్ష్మిని ఈడీ విచారణకు పిలిచింది. పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు సమన్లు జారీ చేసింది. మంచు లక్ష్మి 'Yolo 247' అనే యాప్‌కు ప్రచారం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట ఆమె విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్‌లతో ఆమెకు ఉన్న సంబంధాలు, ప్రచారం కోసం ఎంత పారితోషికం తీసుకున్నారు, ఆ లావాదేవీల వివరాలు, ఏ ఖాతాల ద్వారా డబ్బు బదిలీ జరిగింది వంటి వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ పరిశీలించనుంది.
సురైష్ రైనా గురించి
2005 జూలైలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు సురేష్ రైనా. 2010లో అదే శ్రీలంకపై తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్.2010లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున చాలా కాలం ఆడాడు. ఆ జట్టు రెండు సంవత్సరాలు నిషేధంలో ఉన్నప్పుడు గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా, తరువాత దేశీయ క్రికెట్, ఐపీఎల్ నుండి కూడా రిటైర్ అయ్యాడు.