/rtv/media/media_files/2025/10/19/kohli-and-gill-2025-10-19-20-31-21.jpg)
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి పాలవడంతో, టీమ్ ఇండియా కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో (వన్డే, టీ20, టెస్ట్) కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన భారత కెప్టెన్లలో గిల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. క్రికెట్ చరిత్రలో టెస్ట్, వన్డే, టీ20... మూడు ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ మాత్రమే ఉండగా, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఓటమి తర్వాత శుభ్‌మన్ గిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. 2024లో జింబాబ్వేపై గిల్ తొలి టీ20 కెప్టెన్సీ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై కెప్టెన్‌గా ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. గతంలో విరాట్ కోహ్లీ కూడా తన తొలి టీ20, తొలి వన్డే, తొలి టెస్ట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా ఓటమిని చవిచూశాడు. ఈ ఓటమి అంతర్జాతీయ కెప్టెన్సీలో శుభ్‌మన్ గిల్‌కు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చినా, రాబోయే మ్యాచులలో పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ రికార్డుతో గిల్ ప్రపంచ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన తొమ్మిదవ కెప్టెన్‌గా నిలిచాడు - బ్రెండన్ మెకల్లమ్, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు.
భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలగడంతో 26 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31), నితీశ్ (19), శ్రేయస్ (11), సుందర్ (10), గిల్ (10) పరుగులు చేశారు. రోహిత్ (8), హర్షిత్ రాణా (1) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా కోహ్లీ డకౌట్ అయ్యాడు. చివరి బంతితోపాటు 26వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు నితీశ్ (19*). దీంతో భారత్ 130 పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, ఓవెన్ 2, కునెమన్ 2.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ తీశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్‌కు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46*), జోష్ ఫిలిప్ (37) రాణించారు. రెన్ షా (21*) , ట్రావిస్ హెడ్ (8)పరుగులు చేశారు. రెండో వన్డే గురువారం జరగనుంది. కాగా ఈ ఏడాది వన్డేల్లో భారత్‌కిది తొలి ఓటమి. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది.