Rafael Nadal : టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ చివరిదని తెలిపాడు. ఇక కొంతకాలంగా గాయాలతో ఇబ్బందిపడుతున్న 38 ఏళ్ల నాదల్.. గత నెలలో జరిగిన లేవర్ కప్ నుంచి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కాగా చివరగా పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన టోర్నీలో ఆడాడు.
ఇక తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వీడ్కోలు పలుకుతున్నా. గడిచిన రెండేళ్లు కఠినంగా అనిపించాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత టైమ్ పట్టింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రారంభం, ముగింపు ఉంటుంది’ అంటూ నాదల్ చెప్పుకొచ్చాడు.
స్పెయిన్‌కు చెందిన నాదల్.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అడుగుపెట్టాడు. కెరీర్ మొదలుపెట్టిన నాలుగు ఏళ్లకే 2005-ఫ్రెంచ్ ఓపెన్ సాధించి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ సాధించాడు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నాదల్.. 2 వింబుల్డెన్, 2 ఆస్ట్రేలియన్ ఓపెన్, 14 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్ ఓపెన్ టైటిల్స్ దక్కించుకున్నాడు.
Also Read : కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా? జరిగేది తెలిస్తే షాకే!