/rtv/media/media_files/2026/03/08/india-2026-03-08-20-14-45.jpg)
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ పవర్‌ప్లేలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్కోరు నమోదు చేసింది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం మొదటి 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు రాబట్టి టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే పవర్‌ప్లేలో నమోదైన అత్యుత్తమ స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో వెస్టిండీస్ పేరిట ఉన్న 92/1 రికార్డును (అఫ్గానిస్థాన్‌పై) భారత్ ఇప్పుడు సమం చేసింది, కానీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఈ పరుగులు చేయడం భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం.
నిజానికి మ్యాచ్ ప్రారంభంలో భారత ఓపెనర్లు చాలా నెమ్మదిగా ఆడారు. కివీస్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ వేసిన మొదటి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ క్యాంప్‌లో ఏదో తెలియని ధీమా కనిపించింది. కానీ మూడో ఓవర్ నుంచి అసలు సినిమా మొదలైంది. జాకబ్ డఫీ వేసిన ఓవర్లో అభిషేక్, సంజూ కలిసి 15 పరుగులు పిండుకున్నారు.
భారత బ్యాటర్ల దాడికి న్యూజిలాండ్ బౌలర్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. లూకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్లో 24 పరుగులు, మ్యాట్ హెన్రీ వేసిన తర్వాతి ఓవర్లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నారు. కివీస్ బౌలర్లు ఏకంగా 8 వైడ్లు వేయడం వారిపై ఉన్న ఒత్తిడిని స్పష్టం చేస్తోంది. అభిషేక్ శర్మ తన ట్రేడ్ మార్క్ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
2025లో ఇండియాకు అద్భుత విజయాలను అందించిన ఓపెనింగ్ కాంబినేషన్ మళ్ళీ ఫైనల్‌లో రిపీట్ అయ్యింది. ఒకవైపు అభిషేక్ శర్మ బౌలర్లపై విరుచుకుపడుతుంటే, మరోవైపు సంజూ శాంసన్ చాలా పరిణతితో ఆడుతూ లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలిస్తున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ ఏకంగా 92 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.
Follow Us