IND Vs ENG: మ్యాచ్‌లో ఆ ఆటగాడిని మిస్ అయ్యాను - సిరాజ్ ఎమోషనల్

ఓవల్ టెస్టులో భారత్ విజయం తర్వాత మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా లేకపోవడంపై స్పందిస్తూ "ఈ విజయం ప్రత్యేకమైంది. కానీ జస్సీ భాయ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అతనంటే నాకు, జట్టుకు నమ్మకం" అని పేర్కొన్నాడు.

New Update
ind vs eng team india after the victory

ind vs eng team india after the victory

ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. లండన్‌లోని ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 6 పరుగుల తేడాతో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌కు పరుగుల పరంగా అత్యంత తక్కువ తేడాతో వచ్చిన విజయం కావడం విశేషం. 

దుమ్ముదులిపేసిన సిరాజ్

మొదట ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. నాయర్ (57) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లు, జోష్ టంగ్ 3 వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మరియు మహ్మద్ సిరాజ్ చెరో 4 వికెట్లు తీశారు. 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 396 పరుగుల భారీ స్కోరు సాధించి ఇంగ్లాండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో (118) రాణించాడు. శుభ్‌మన్ గిల్ (89) కూడా వెన్నెముకలా నిలిచాడు. 

374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు ఉదయం 339/6 వద్ద ఆటను ప్రారంభించింది. విజయానికి ఇంకా కేవలం 35 పరుగులు అవసరం ఉన్న సమయంలో భారత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో దుమ్ముదులిపేశాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 

ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. దీంతో టెస్ట్ తర్వాత అభిమానులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, ప్రస్తుత ఆటగాళ్లందరూ సిరాజ్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలో మ్యాచ్ విజయం తర్వాత సిరాజ్ తన ఆటతీరు గురించి బహిరంగంగా మాట్లాడాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తాను ఒక ఆటగాడిని మిస్ అయ్యానని తెలిపాడు. 

‘‘ఈ విజయం ప్రత్యేకమైంది. నేను జస్సీ భాయ్‌ని మిస్ అయ్యాను. జస్సీ భాయ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అతనంటే నాకు, జట్టుకు నమ్మకం.’’ అని తెలిపాడు. కాగా పనిభారం నిర్వహణ కారణంగా బుమ్రా చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు దూరం అయిన విషయం తెలిసిందే. సిరాజ్ అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, బుమ్రా 3 టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు.

Advertisment
తాజా కథనాలు