Harmanpreet Kaur : హ్యాట్సాఫ్ హర్మన్‌ప్రీత్‌.. గురుభక్తి చాటుకున్న భారత కెప్టెన్!

విజయం అనంతరం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం పట్టలేకపోయి, నేరుగా హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ వద్దకు వెళ్లి, భక్తితో ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

New Update
india

భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రక వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత మైదానంలో అత్యంత భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. విజయం అనంతరం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం పట్టలేకపోయి, నేరుగా హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ వద్దకు వెళ్లి, భక్తితో ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ముజుందార్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన వెంటనే హర్మన్‌ప్రీత్‌ను లేపి, గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యం మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

హర్మన్‌ప్రీత్‌పై ప్రశంసల వర్షం

దీంతో  హర్మన్‌ప్రీత్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గురువుపై ఆమెకు ఉన్న గౌరవాన్ని కొనియాడుతున్నారు. దశాబ్దాల తరబడి క్రికెట్‌లో విశేష అనుభవం ఉన్న ముజుందార్, తన పదవీకాలంలోనే భారత జట్టుకు ఈ తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఒత్తిడిలో జట్టును సమర్థంగా నడిపించడంలో ఆయన వ్యూహాలు, మద్దతు ఎంతో కీలకం. లీగ్ దశలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత హెడ్ కోచ్ ఆటగాళ్లలో దైర్యాన్ని నింపారు. 

ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత కోచ్ ముజుందార్ డ్రెస్సింగ్ రూమ్ ప్రసంగం ఎలా ఇచ్చారో హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. అనంతరం భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ తరువాత సెమీ ఫైనలో ఆస్ట్రేలియా, ఫైనల్లో  దక్షిణాఫ్రికాను ఓడించి కప్ ను సాకారం చేసుకుంది. 2005, 17లో ఫైనల్ కు చేరిన టీమిండియా కప్ ను కోల్పోయింది. తాజాగా ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ పై వరల జల్లు కురుస్తుంది.  

ఇక భారత జట్టు కప్పు గెలవడంపై హెడ్ కోచ్ అమోల్ ముజుందార్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడూ గర్వపడేలా మహిళా జట్టు చేసిందన్నారు. ఇది మహిళా క్రికెట్‌కు సువర్ణాధ్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.  రెండేళ్ల కిందట భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములు చవిచూశామన్న ఆయన .. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు