Cricketer Sri Charani: తెలుగు బిడ్డ.. క్రికెటర్ శ్రీ చరణికి CM చంద్రబాబు బంపరాఫర్.. రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1 జాబ్..

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా ప్లేయర్ అయిన తెలుగమ్మాయి శ్రీ చరణికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇల్లు నిర్మాణం కోసం కడపలో 1000 చ.గ. స్థలం కేటాయించారు.

New Update
ap govt announces 2.5 crore reward, group 1 job for woman cricketer sree charani

ap govt announces 2.5 crore reward, group 1 job for woman cricketer sree charani

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేత, టీమిండియా ప్లేయర్ అయిన తెలుగు అమ్మాయి శ్రీ చరణికి భారీ నజరానా ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ చరణి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్ 1 ఉద్యోగం

ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న శ్రీ చరణికి ముఖ్యమంత్రి రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఆమె ఇల్లు నిర్మించుకోవడానికి కడపలో 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సీఎం, మంత్రి లోకేష్‌తో ఆనంద క్షణాలు

ప్రపంచ కప్ విజయం తర్వాత శ్రీ చరణి ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్‌తో తన ఆనంద క్షణాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్.. క్రికెటర్ శ్రీ చరణిని అభినందించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటిందని, శ్రీ చరణి మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రికి టీ-షర్ట్ అందజేత

ఈ సంద‌ర్భంగా శ్రీ చ‌ర‌ణి త‌న‌ సహచర మ‌హిళా క్రికెట‌ర్లు సంత‌కాలు చేసిన టీ ష‌ర్ట్‌ను ముఖ్య‌మంత్రికి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన సీఎం.. శ్రీ చరణి జట్టు భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీ చరణితో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

గన్నవరంలో ఘన స్వాగతం

ముఖ్యమంత్రిని కలవడానికి ముందు.. శ్రీ చరణికి గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఆమె సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మంత్రి నారా లోకేష్ శ్రీ చరణికి సాదరంగా స్వాగతం పలికారు. మహిళా క్రికెట్‌కు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

Advertisment
తాజా కథనాలు