క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా హాకి దిగ్గజం ధ్యాన్ చంద్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమన్నారు. విద్యార్థులకు చదువుల్లో ఆసక్తి పెరగాలంటే వారికి ఆటలు అవసరమన్నారు.
దీన్ని గుర్తించే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యువత క్రీడల్లో పాల్గొనేందుకు ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామని వెల్లడించారు. పాఠశాలల్లో సైతం విద్యార్థుల కోసం స్కూల్ మరో గంటలో ముగుస్తుందనగా.. పీఈటీలు విద్యార్థుల కోసం ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో ఉదయం నుంచి చదివి అలసిపోయిన విద్యార్థులు మానసికంగా ఉపశమనం పొందుతున్నారని వివరించారు. గ్రామ స్థాయిలో జరిగే పోటీల్లోనే విద్యార్థులు వారి ప్రతిభను కనబర్చాలని సూచించారు.
చిన్నతనం నుంచి వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఇప్పుడు భారత్ తరపున వివిధ క్రీడల్లో గొప్ప ప్లేయర్లుగా మారారని గుర్తు చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించి వారిని ప్రొత్సహిస్తుందని, వారు తమ లక్ష్యాలను వదకలకుండా ప్రయత్నిస్తే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. క్రీడాకారులు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రౌండ్‌లను వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం గ్రౌండ్ కోసం నిధులు కేటాయిస్తుందని ఆయన వివరించారు.