Vizianagaram train accident:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత అక్కడి ట్రాక్ ను వెంటనే పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నిన్నంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా జరిగాయి. దీంతో ఆ దిశగా వెళ్ళే చాలా రైళ్ళను ఆపేసారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు. ఈరోజు కూడా మరి కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

New Update
Vizianagaram train accident:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు

విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండి దగ్గర జరిగిన ప్రమాదం దృష్ట్యా రైల్వే అధికారులు నేడు కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ దారిలో ప్రధాన రైళ్ళయిన హౌరా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హౌరా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌- హైదరాబాద్‌ (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖ-గుణుపుర్‌, విశాఖ-రాయగడ, విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంతో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే.

Also read:హమాస్ చెర నుంచి తమ దేశ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్

మరోవైపు ఈ రైలు ప్రమాదంపై కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ విచారణ మొదలెట్టింది. ఢిల్లీ, భువనేశ్వర్‌ నుంచి నిపుణుల కమిటీ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు, పరిస్థితుల మీద ఆరా తీస్తున్నారు. కేబుళ్ళకు విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో పలాస రైలు ముందుకు కదల్లేదని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. తరువాత రైలు ఆగిపోయిన విషయం కూడా దగ్గర్లో ఉన్న స్టేషన్లకు చేరలేదు. దీనివల్లే అదే ట్రాక్ మీద వెళ్ళే రాయగడ ట్రైన్ కు సిగ్నల్ ఇచ్చారని....ఇదే ప్రమాదం జరగడానికి దారి తీసిందని భావిస్తున్నారు రైల్వే సేఫ్టీ టీమ్. పలాస రైలును రాయగడ ప్యాసింజర్‌ ఢీకొన్నప్పుడు దాని వేగం 80 కి.మీ. వరకు ఉండొచ్చని.. ఒక్కసారిగా అంత వేగాన్ని నియంత్రించడమూ సాధ్యం కాదని చెబుతున్నారు. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సిగ్నలింగ్‌ ఇలా పలు విభాగాలకు చెందిన నిపుణుల కమిటీ.. అన్ని కోణాల్లో ఈ ఘటనపై విశ్లేషిస్తోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా ఆర్పీఎఫ్ తనిఖీ చేశారు. రైల్వే ఐజీ, డీఐజీలు ప్రత్యేక బృందాలతో పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి.. విద్యుత్తు సరఫరా ఆగిపోవడం వెనుక విద్రోహుల దుశ్చర్య ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.. త్వరలోనే ఈ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు