మీరు ఏ రోజైనా నిద్రపోవడానికి అవస్థలు పడ్డారా? రాత్రంతా సరైన నిద్ర లేకుండా గడిపారా? అయితే మీకు ఆ మరుసటి రోజు ఎదురయ్యే భయంకరమైన చికాకు, నీరసం, దేనిపైకా ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు గురించి తెలిసే ఉంటుంది. రాత్రిళ్లు కచ్చితంగా ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. సరిపడా గంటలు సుఖంగా నిద్రపోకపోతే ఆ ప్రభాతం తర్వాత రోజుపై పడుతుంది. అలసిపోయినట్లు భావిస్తారు, సంతోషంగా ఉండలేరు. నిద్ర లేమితో బాధపడుతున్న వ్యక్తులు సెలవుల్లో లేదా సోషల్ ఆబ్లిగేషన్స్ లేనప్పుడు ఎక్కువసేపు నిద్రపోతారు.
వర్క్ డిమాండ్లు, జీవనశైలి మార్పులు, పర్యావరణ కారకాల సహా వివిధ అంశాలు నిద్ర లేమికి దోహదం చేస్తాయి. దీని కారణంగా ఏకాగ్రత లోపించడం, మానసిక ఆందోళన వంటి స్వల్పకాలిక పరిణామలు మాత్రమే ఎదురవుతాయనుకుంటే పొరపాటు పడినట్లే. దీర్ఘకాలం స్లీపింగ్ డిజార్డర్లతో బాధపడుతుంటే రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి నిద్రకు ఆటంకం కలిగించే సమస్యలను పరిష్కరించడం ముఖ్యం. దీనికి సంబంధించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
రెస్‌మెడ్ స్లీప్ సర్వే 2024 ప్రకారం.. సర్వేలో భాగమైన వారిలో 44% మంది 8-8.99 గంటల నిద్రను మంచి నిద్రగా భావిస్తారు. అయితే కేవలం 29% మంది మాత్రమే ఒక రాత్రి 8-8.99 గంటల పాటు నిద్రపోతారు. నాణ్యమైన నిద్ర ప్రయోజనాల గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు మంచి నిద్ర ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారు. 49% మంది నిద్రలేని రాత్రి లక్షణాలను నివేదించారు. 54% మంది నిద్ర ఆరోగ్యంపై సమాచారం కోసం వైద్యుడిని కూడా సంప్రదించలేదు.
నిద్రలేని రాత్రి, ప్రొడక్టివిటీ, ఆరోగ్య ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందనే దాని గురించి భారతదేశంలో విస్తృత అవగాహన ఉందని సర్వే పేర్కొంటోంది. నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న స్లీపింగ్ కండిషన్లకు పరిష్కారం పొందేందుకు ఆన్‌లైన్‌లో లక్షణాల కోసం సెర్చ్ చేయడం మానేసి వైద్యుడిని సందర్శించడం చాలా ముఖ్యం.