Parliament Security Breach: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను వదలి అలజడి సృష్టించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రధాని మోదీ కూడా దీనిపై అత్యున్నత సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనలో నలుగురు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి వారిని ఏడు రోజుల కస్టడీకీ తరలించారు. ఇక ఆ నలుగురు నిందితులకు ఆశ్రయం కల్పించిన ఐదో నిందితుడు విశాల్ శర్మను (Vishal Sharma) గురువారం గురుగ్రాంలో పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజున ఆరో నిందితుడైన లిలత్ మోహన్‌ను (Lalit Mohan) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అతడే లోంగిపోయాడు. ప్రస్తుతం లిలిత్‌ను విచారణ చేస్తున్నారు.
Also Read: ‘రాజకీయాలు ఆడొద్దు’? ప్రతిపక్షాలపై అమిత్‌షా ఫైర్!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముందుగా సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు నిందితులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభ జరుగుతున్న ఛాంబర్‌లోకి దూకి కలర్ గ్యాస్ క్యానిస్టర్ వదిలారు. చివరికి ఎంపీలు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరోవైపు పార్లమెంటు బయట నిరసన చేస్తున్న అమూల్ షిండే, నీలమ్ దేవీలను పోలీసులు అదుపులకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనకు కారణమైనందుకు వీరిపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి ఏడు రోజుల కస్టడీకి తరలించారు. అయితే విచారణలో ఈ నిందితులు ఒకే విషయాన్ని చెప్పారు. భారత్‌ను బ్రీటీష్ వాళ్లు పాలిస్తున్నప్పడు ఆ సమయంలో సెంట్రల్ అసెంబ్లీలో విప్లవకారుడైన భగత్ సింగ్ (Bhagat Singh) ఎలా బాంబులు విసిరారో అలానే చేద్దామనుకున్నామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. పార్లమెంటులో భద్రత వైఫల్యం చోటుచేసుకున్నందుకు లోక్‌సభ సెక్రటేరియట్ ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయితే పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేయడంతో ఈ కుట్రకు ప్రధాన సూత్రదారి కోల్‌కతాకు చెందిన లలిత్ మోహన్ అని తేల్చారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లలిత్.. భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని మిగితా వారితో కలిసి దేశం దృష్టిని ఆకర్షించేందుకు ప్రణాళిక వేసాడు. వీళ్లందరూ కలిసి ఫేస్‌బుక్‌లోని భగత్‌సింగ్ ఫ్యాన్ పేజీలో చేరారు. చివరికి ఇలా పార్లమెంటులో అలజడి సృష్టించారు.