ఇప్పటికే మీరు డ్రై డే గురించి వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా నో నాన్ వెజ్ డేని ప్రకటించింది. నవంబర్ 25, శనివారం రాష్ట్రంలోని అన్ని స్లాటర్ హౌస్‌లు, అన్ని మాంసం విక్రయ దుకాణాలను మూసివేయాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి, ప్రభుత్వం కూడా ఒక ఉత్తర్వు జారీ చేసింది, అందులో నవంబర్ 25 న రాష్ట్రంలో మాంసం విక్రయించే దుకాణాలన్నీ మూసివేయాలని పేర్కొంది.
మహావీర్ జయంతి, బుద్ధ జయంతి, గాంధీ జయంతి రోజున రాష్ట్రంలో నాన్ వెజ్ విక్రయించకూడదని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి అన్ని డివిజనల్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లకు లేఖ రాశారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శివరాత్రి మహాపర్వ, సాధు TL వాస్వానీ జయంతి రోజు కూడా మాంసం విక్రయించకూడదని పేర్కొంది. ఈ రోజున అన్ని మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. నవంబర్ 25వ తేదీ శనివారం టిఎల్ వాస్వానీ జయంతి కావడంతో మాంసం దుకాణాలు, కబేళాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలని అన్ని పట్టణ స్థానిక సంస్థలను కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల శనివారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హలాల్ ధృవీకరణతో ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలను తక్షణమే నిషేధించింది. అయితే ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.