RSS: బీజేపీపై ఆర్ఎస్‌ఎస్‌ ఘాటు విమర్శలు..

అహంకారంగా వ్యవహరించిన వారిని రాముడు 240 వద్దే ఆపేశాడని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు కామెంట్లు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు సామాన్య ప్రజలను కలకవకపోవడం వల్లే బీజేపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

RSS: బీజేపీపై ఆర్ఎస్‌ఎస్‌ ఘాటు విమర్శలు..
New Update

RSS vs BJP: 'ఏదైనా లక్ష్యం నెరావేరాలంటే కష్టపడి పని చేయాలి. సోషల్ మీడియాలో పోస్టర్లు, సెల్ఫీలను షేర్‌ చేస్తే లక్ష్యాలు నెరవేరవు. ప్రధాని మోదీ (PM Modi) వీధుల్లో ప్రజల గొంతులను వినలేకపోయారు...' ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ మౌత్‌ పీస్‌ వెబ్‌సైట్‌ 'ఆర్గనైజర్'లో ప్రచురితమైన కథనంలోని రాతలు. నిజానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కోసం ఆర్‌ఎస్‌ఎస్ పని చేయలేదన్న అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఈ కామెంట్స్‌పైనా ఆర్‌ఎస్‌ఎస్‌ ధీటైన సమాధానం చెప్పింది.

ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీ అని.. ఆ పార్టీకి సొంత కార్యకర్తలు ఉన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చెప్పుకొచ్చింది. ఓటర్లకు చేరువ కావడం, పార్టీ ఎజెండాను వివరించడం లాంటి పనులు చేయడం బీజేపీ బాధ్యత అని ఆర్ఎస్ఎస్ సభ్యుడు రతన్ శారదా 'ఆర్గనైజర్' కథనంలో రాసుకొచ్చారు. ప్రజలను, దేశాన్ని ప్రభావితం చేసే అవగాహన కల్పించడమే ఆర్‌ఎస్‌ఎస్ పని అని చెప్పుకొచ్చారు. 1973 నుంచి 1977 వరకు మినహా ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్ నేరుగా రాజకీయాల్లో పాల్గొనలేదని సంఘ్‌ నేతలు గుర్తుచేస్తున్నారు.

Also Read: వాహనదారులకు బిగ్ షాక్.. 3 రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ స్వయంగా మ్యాజిక్‌ ఫిగర్‌ను టచ్‌ చేయకపోవడానికి గల కారణాలను ఆర్‌ఎస్‌ఎస్‌ తన కథనంలో రాసింది. ఎంపీలు, మంత్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారని.. కనీసం వారి నియోజకవర్గాల్లోని ప్రజలతో కూడా కలవరని అభిప్రాయపడింది. ఓ కార్మికుడిని, సామాన్య పౌరుడిని వాళ్లు కలవరని చెప్పింది. ఇలా ప్రజల్లో కలిసి ఉండకపోతే ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఘాటుగా విమర్శించింది. ఎన్నికల ఫలితాలు అతి విశ్వాసంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు, వారి నాయకులకు ఓ గుణపాఠాన్ని నేర్పాయని ఆర్‌ఎస్‌ఎస్‌ తన మౌత్‌ పీస్‌లో పేర్కొంది. అటు ఎన్నికల్లో బీజేపీ అహంకారాన్ని ప్రదర్శించిందని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ విమర్శించారు. ఈ అహంకారం వల్లే రాముడు బీజేపీని మెజార్టీ సీట్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. అటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం బీజేపీ లక్ష్యంగా కామెంట్స్‌ చేస్తుండడం సంఘ్‌ పరివార్‌లో పెను భూకంపానికి కారణమవుతోంది.

'నిజమైన సేవకుడు గౌరవాన్ని కాపాడుకుంటాడు. అతను పని గురించే ఆలోచిస్తాడు.. నేను ఈ పని చేశాను అని చెప్పే అహంకారం అతనికి ఉండదు. ఆ వ్యక్తిని మాత్రమే నిజమైన సేవక్ అని పిలుస్తారు..' అని మోహన్‌ భగవత్‌ చేసిన కామెంట్స్‌ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. అటు ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను బీజేపీ ఏ మాత్రం పట్టించుకోలేదన్న వాదన కూడా ఉంది. జేపీ నడ్డా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ కోపంగా ఉందని అర్థమవుతోంది.

Also Read: యోగి ఆదిత్యనాథ్‌తో.. RSS అధినేత మోహన్ భగవత్ భేటీ!

బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం లేదని అర్థం వచ్చేలా నడ్డా కామెంట్స్‌ చేశారు. ఇక ఎన్నికల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌తో తమకేమీ సంబంధం లేదన్నట్టే బీజేపీ వ్యవహరించిందన్న ప్రచారమూ ఉంది. మొత్తంగా చూస్తే బీజేపీ పనితీరు పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ మాత్రం సంతృప్తిగా లేదని అర్థమవుతోంది. బీజేపీ తన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల నుంచి వస్తున్న మాటలు సూచిస్తున్నాయి.

#pm-modi #bjp #rss #mohan-bhagwant
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe