ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రానున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు అలాగే నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే పలు బస్సులు డిపోలకు చేరాయి. త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిల్లో ప్రయాణించాలంటే మహిళలు కూడా టికెట్ కొనాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్టినరీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయలేకపోతుంది.
దీంతో ఇప్పటివరకు రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో రూ.610 కోట్లు బకాయిపడటంతో.. ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, పల్లెవెలుగు, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి ఎక్కువగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి ఎక్స్‌ప్రెస్ బస్సులే. అందుకోసమే వీటి సంఖ్య మిగతావాటి కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ మహిళలకు పల్లెవెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణాలు అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి పడిపోయింది. డీలక్స్ కేటగిరి బస్సులు ఉన్నా కూడా వాటికి ఆదరణ తక్కువగానే ఉంది. అందుకే వీటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.
Also read: సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఆ నటీనటులపై చర్యలకు సిద్ధం!
ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ సంస్థ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వీటిల్లో టికెట్ ధర 5 నుంచి 6 శాతం ఎక్కువగా ఉండనుంది. అలాగే డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే.. సీట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉండే రూట్‌లలోనే ఈ బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో పురుషులకు సీట్లు దొరకకపోవడంతో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు బస్సులెక్కుతారని భావిస్తోంది.
ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10 నుంచి 15 శాతం మంది ఈ బస్సులు ఎక్కే సూచనలు కనిపిస్తున్నట్లు సంస్థ భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ స్టాపులు ఉండటం వల్ల ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే ఛాన్స్ ఉంది. అయితే గతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి. అవి పాతబడిపోవడం వల్ల వాటిని తొలగించేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించనున్నారు. నగరంలో ఆర్టినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణం ఉండటంతో టికెట్ ఆదాయం బాగా తగ్గిపోయింది.
Also Read: ఈ ఏడాదిలో రూ.185 లక్షల కోట్లకు దేశ అప్పు: కేంద్రం
ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు ఆటోలలో వెళ్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులు ఎక్కే ఛాన్స్ ఉంటుంది. వీటివల్ల ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని నగర అధికారులు భావిస్తున్నారు. మొత్తం 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు.