PM Oath Ceremony: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ (Narendra Modi) సిద్ధమయ్యారు. ఈనెల తొమ్మిదిన అంటే ఆదివారం రాత్రి 7.17గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈ స్వీకారోత్సవానికి చాలా మంది ప్రముఖులు విచ్చేయనున్నారు. భారత్‌కు పొరుగు దేశాలు అయిన బంగ్లాదేశ్,శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ ప్రధానులు, అధ్యక్షులు హాజరవుతున్నారు.
ప్రమాణ స్వీకారానికి ఇంక ఒక్కరోజే సమయం ఉండడంతో ఆహ్వానాలు అందిన దేశాల ప్రధానులు అందరూ దేశ రాజధానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు.అలాగే శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే,మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు , సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ ఈరోజు ఢిల్లీకి రానున్నారు. ఇక వీరితో పాటూ మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ , భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేలు కూడా ఇవాళ, లేదా రేపు ఉదయం లోపున చేరుకోనున్నారు. వీరి కోసం ప్రధాని కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
భద్రత కట్టుదిట్టం..
వివధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు మోదీ ప్రమాణస్వీకారానికి హాజరవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటూ ఎన్‌ఎస్‌జి కమాండోలు, డ్రోన్‌లు, స్నిపర్‌లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు,రాష్ట్రపతి భవన్‌కు కాపలా కాయనున్నాయి. కర్తవ్య పథం పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలను నిశితంగా పర్యవేక్షిస్తూ అధిక స్థాయిలో నిఘా ఉండేలా ఏర్పాట్లు చేశారు. దాంతో పాటూ ప్రతి దేశాధినేతకు సంబంధించిన ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు బస చేసే హోటళ్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: మోదీకి టెస్లా అధిపతి శుభాకాంక్షలు..కాబోయే ప్రధాని రిప్లై