ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపం బయటపడింది. బుధవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని పర్యటించారు. ఖుంటి జిల్లాలోని బిర్సా ముండా గ్రామమైన ఉలిహతుకు కూడా ప్రధాని వెళ్లారు. ప్రధాని అక్కడ వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను జెండా ఊపి, రూ. 24 వేల కోట్ల విలువైన పథకాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ బిర్సా మెమోరియల్ పార్క్‌కు వెళుతుండగా, రేడియం రోడ్డులో ఉన్న ప్రధాని కాన్వాయ్ కారుకు ఓ మహిళ అకస్మాత్తుగా అడ్డు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ మహిళను అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
మహిళ కాన్వాయ్ కు అడ్డురావడంతో అక్కడ కాసేపు ప్రధాని మోదీ కారు ఆగింది. అయితే, కొన్ని సెకన్లలో, ప్రధానమంత్రికి రక్షణగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది మహిళను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. మహిళ అకస్మాత్తుగా కాన్వాయ్ ముందుకు దూసుకురావడంతో కాన్వాయ్‌లోని వాహనాలకు ఎమర్జెన్సీ బ్రేకులు వేయాల్సి వచ్చింది. ప్రధాని మోదీ కాన్వాయ్ నిలిచిపోవడంతో ఎన్‌ఎస్‌జీతో పాటు ఇతర సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ప్రధాని మోదీ భద్రతా బృందం, పోలీసు సిబ్బంది వెంటనే ఆ మహిళను రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ప్రధాని కాన్వాయ్ ముందుకు కదిలింది. వార్తా సంస్థ ANI ప్రకారం, ప్రధాని కాన్వాయ్ ముందుకు సాగడంతో, పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళ తన సమస్యలను కొన్నింటిని ప్రధాని మోదీకి అందించాలని కోరుకుందని, అందుకే ఆమె ప్రధాని కాన్వాయ్‌లోకి ప్రవేశించిందని చెబుతున్నారు.