SBI Submits Electoral Bonds : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను మంగళవారం ఎన్నికల కమిషన్ (EC)కి సమర్పించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన సమాచారం అందించడానికి గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court) ఎస్బీఐని మందలించింది. దీంతో పాటు మార్చి 12వ తేదీ నాటికి ఎస్‌బీఐ పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.
ఇది కూడా చదవండి: చవటలు..దద్దమ్మలు..కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్..!
సుప్రీంకోర్టులో సీజేఐ డి.వై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు ఎస్‌బిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పంచుకున్న సమాచారాన్ని ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇప్పుడు ఎన్నికల సంఘం మార్చి 15 లోపు తన వెబ్‌సైట్‌లో ఎస్బిఐ పంపిన డేటాను ప్రచురించాలి. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా హాజరయ్యారు. బ్యాంక్ తన ఆదేశాలు, సమయపాలనలను పాటించడంలో విఫలమైతే, ఫిబ్రవరి 15 నాటి తన నిర్ణయానికి ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినందుకు కోర్టు దానిపై చర్య తీసుకోవచ్చని బెంచ్ ఎస్‌బిఐకి నోటీసు జారీ చేసింది.
ఫిబ్రవరి 15న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రం ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, మార్చి 13లోగా దాతలు, విరాళాలుగా ఇచ్చిన మొత్తం, విరాళాలు స్వీకరించిన వారి వివరాలను వెల్లడించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తర్వాత, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్‌బిఐ విజ్ఞప్తి చేసింది. అయితే సుప్రీం కోర్టు సోమవారం ఎస్‌బిఐ అభ్యర్థనను తిరస్కరించి మంగళవారం సాయంత్రం పని గంటలలో సమర్పించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను గౌరవిస్తూ ఎస్బీఐ నిర్ణీత సమయంలో సమర్పించింది.