Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఐపీఎల్ అడ్వైజరీ భారీ షాక్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమి పాలైనప్పటికీ సంజూ (86) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరి పోరాటం చేస్తూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఈ మ్యాచ్ లో సంజూ అవుటైన విధానం వివాదాస్పదమైంది.
బౌండరీ లైన్ వద్ద క్యాచ్ వివాదం..
ఈ మేరకు ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో సంజు షార్ట్ పిచ్ బంతిని లాంగాన్ వైపుగా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద హోప్ క్యాచ్ అందుకోగా.. హోప్ ఎడమ పాదం బౌండరీ లైన్ ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. షూ, బౌండరీ లైన్ మధ్య గ్యాప్ కనిపించలేదు. మూడో అంపైర్ ఔటిచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా శాంసన్ అంపైర్‌తో వాదించి పెవిలియన్ చేరుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ.. కీలక ప్రకటన జారీ చేసింది. ‘రాజస్థాన్ కెప్టెన్ సంజూకు మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం జరిమానా విధిస్తున్నాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఫైన్ పడింది. ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు తేలింది. మ్యాచ్ రిఫరీ నిర్ణయంతోనే జరిమానా విధించాం' అని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Sam Pitroda: భారతీయులు దక్షిణాదిన ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ శామ్ పిట్రోడా కొత్త వివాదం..
ఇక ఓటమి గురించి మాట్లాడిన సంజూ.. చివరిదాకా మ్యాచ్ మా చేతుల్లోనే ఉందని భావించాం. కానీ ఐపీఎల్‌లో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారిపోతుంటాయి. గత మూడు మ్యాచులు చివరి వరకూ తీసుకొచ్చి రెండింట్లో ఓడిపోయాం. తప్పులను సరిదిద్దుకుని రాబోయే మ్యాచుల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని వెల్లడించాడు.