మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటీపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఇద్దరు నేతలు తమ సంబంధాలను కొనసాగిస్తున్నట్లయితే సిద్దాంతాల విషయంలో వారి మద్దతుదారులు ఒకరితో ఒకరు ఎందుకు పోట్లాడాలి అని ఆయన నిలదీశారు. భేటీ విషయంలో శరద్ పవార్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేతో ఎంపీ సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. అజిత్ పవార్ తో శరద్ పవార్ భేటీపై వారిద్దరూ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మీటింగ్ విషయంలో శరద్ పవార్, రోహిత్ పవార్ వ్యాఖ్యలను తాను గమనించానన్నారు. అజిత్ పవార్ తన మేనల్లుడని, అందుకే ఆయన్ని కలిశానని శరద్ పవార్ చెప్పారని తెలిపారు.
తమ మధ్య సంబంధాలను నిలుపుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ పవార్ అన్నారని వెల్లడించారు. అలాంటప్పుడు కేవలం ఇరు పక్షాల కార్యకర్తలు మాత్రం రోడ్లపై ఎందుకు గొడవలు పెట్టుకోవాలని ప్రశ్నించారు. సిద్దాంతాల కోసం పోరాడుతున్న కార్యకర్తలకు మీరు ఏం సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నారని నిలదీశారు. అది కేవలం కపటత్వం మాత్రమేనన్నారు.
తాము కూడా తమ చీలిక వర్గం నేత ఏక్ నాథ్ షిండే లేదా ఆ వర్గం నేతలతో కలిసి టీ తాగడం ప్రారంభిస్తే అది కార్యకర్తలకు ఎలాంటి సందేశం పంపిస్తుందన్నారు. అప్పుడు కార్యకర్తలు సిద్దాంతం కోసం ఎలా పోరాడుతారని ఆయన నిలదీశారు. అలాంటి కపటత్వం శివసేన డీఎన్ఏలో లేదన్నారు. బహుశా ఎన్సీపీ డీఎన్ఏ వేరుగా వుందేమో తనకు తెలియదన్నారు.