Medaram Jatara : ఆర్టీవీ మేడారం జాతర స్పెషల్!

New Update
Medaram Jatara : ఆర్టీవీ మేడారం జాతర స్పెషల్!

Medaram : అమ్మలు బైలెల్లిరో..

ప్రతీ రెండేండ్ల కోసారి మాఘమాసం(Magha Masam) వచ్చిందంటే చాలు. ములుగు జిల్లా(Mulugu District) లోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రంగా మారిపోతుంది. నిజానికి అది పెద్ద ఊరు కాదు, చెప్పుకోదగ్గ పట్టణమూ కాదు. అదొక కీకారణ్యం. అక్కడక్కడ కొన్ని ఇండ్లు తప్ప పెద్దగా జనం లేని కారడవి. ప్రతి రెండు ఏండ్లకొకసారి అక్కడ మహానగరం వెలుస్తుంది. అక్కడి నిశబ్దాన్ని ఛేదిస్తూ జనసంద్రం ఆవిర్భవిస్తుంది. అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి మూడు రోజులు మాత్రమే. అదే మేడారం జాతర(Medaram Jatara). మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగనున్నది. తెలంగాణా కుంభమేళాగా, ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు కోటిమందికి పైగా జనం హాజరవుతారు.ఏటా మాఘమాసంలో నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క- సారక్క జాతర ఈ నెల 21న మొదలైంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ప్రారంభమైంది. సమ్మక్కను గద్దెకు చేర్చడం, మొక్కులు తీర్చుకోవడం, తరువాత దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. గిరిజనులు తమ గుండెల్లో గుడి కట్టుకుని కొలుచుకునే వనదేవతల జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో జరుగనున్నది. ఈ జాతరకు దాదాపు 1000 ఏండ్ల చరిత్ర ఉంది.

Also Read : నేడు మేడారానికి సమక్క.. జాతరలో అసలైన ఘట్టం

ఎవరీ సమ్మక్క..

13వ శతాబ్దంలో ఒకసారి ఇక్కడి కోయదొరలు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్కకి యుక్తవయసు రాగానే ఆమెను మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వారిరువురికీ జంపన్న, సారక్క, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు. ఒక దశలో మేడారం మళ్లీ కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మరోవైపు ఏటా తనకి కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు ఆదేశిస్తాడు. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్ద రాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది. కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించాడు. అలా యుద్ధం ప్రారంభమైంది. కాకతీయుల చేతిలో పగిడిద్దరాజు కన్నుమూశారు. భర్త మరణవార్తను వినగానే సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. కాకతీయులు సమ్మక్క- సారక్కల మీద విరుచుకుపడే బాణాలను సంధించారు. సారక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట పైకి వెళ్లి మాయమైంది. సమ్మక్కను వెంబడిస్తూ వెళ్లిన వారికి ఆమె అగుపించలేదు. అక్కడ ఒక చెట్టు కింద కుంకుమభరిణి కనిపించింది. సమ్మక్క ఆ కుంకుమభరిణగా మారిపోయిందని భక్తుల నమ్మకం.

జాతర ఇలా..

నిజమైన జాతర జరిగేది నాలుగు రోజులే అయినప్పటికీ.. గిరిజనులు పదిరోజుల ముందు నుంచే జాతర ఏర్పాట్లు చేస్తారు. వేర్వేరు ప్రాంతాల నుంచి దేవతామూర్తులను తీసుకురావడంతో జాతర ప్రారంభమైనట్లు లెక్క. జాతర మొదటి రోజున మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరి వస్తుంది. సారలమ్మను వెదురుకర్ర రూపంలో గద్దెకు తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే సమయంలో ఊరి నుంచి మొదలు ఊరి చివరి వరకు భక్తులు తమ కోరికలు తీరాలని వేడుకుంటూ సాష్టాంగ పడుతారు. పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వస్తారు. సారలమ్మకు ఆరుగురు పూజారులుంటారు. అందరూ కాకా వంశస్తులే.

Also Read : గద్దెనెక్కిన సారలమ్మ.. రేపు చిలుకలగుట్ట నుంచి తరలిరానున్న సమ్మక్క!

ఎదురుకోళ్లు..

జాతరలో అందరూ ఆసక్తిగా చెప్పుకునేది ఎడురుకోళ్లు. తల్లులు గర్రెల ప్రధాన ద్వారాల వద్ద కొందరు కోళ్లను పట్టుకొని నిలుచుంటారు. రూపాయిస్తే భక్తుల పేరుమీద కోడిని గాలిలోకి ఎగురవేస్తారు. కోడి పారిపోకుండా ఒక కాలికి తాడు కట్టి ఉంటుంది. ఈ విధంగా భక్తులు ఒక రూపాయితో దేవతకు కోడిని సమర్పించుకున్నట్టు అవుతుంది. దీన్నే ఎదురుకోళ్లు అంటారు. నిజానికి సార లమ్మ కన్నెపల్లి దేవత కాదు. ఆమె దొడ్ల అనే ఊరులో ఉండే దేవత. అక్కడే మొదట్లో పండగ చేసేవారు. దొడ్లలో ఉన్నట్లే సారలమ్మను పూజించే వంశస్తులు కన్నెపల్లిలోనూ ఉండేవారు. దొడ్లలో తరచుగా వరదలు రావడం, ఇతర కారణాల వల్ల ఆమెను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి కన్నెపల్లిలోనే సారలమ్మను పూజిస్తున్నారు. ఆమెతో పాటు జాతరకు రెండు రోజుల ముందు కొత్తగూడ మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలు దేరుతుంది. పగిడిద్దరాజుతో మేడారం జాతరకున్న సంబంధం కూడా దాదాపు ఇంతేనంటున్నారు. కామారం నుంచి పగిడిద్దరాజును తీసుకువస్తారు. 2006 నుంచే పగిడిద్దరాజును కామారం నుంచి సారలమ్మ భర్త గోవిందరాజులను ఏటూరు నాగారం దగ్గరి కొండాయి గ్రామం నుంచి కాక వంశస్తులు తీసుకువస్తారు. మేడారానికి అడవి మార్గం గుండా సుమారు పదికిలో మీటర్లు ప్రయాణిస్తే కొండాయి గ్రామం వస్తుంది. అక్కడ నాగులమ్మ, గోవిందరాజుల దేవాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ రెండు దేవాలయాలు గుడిసెలే. అయితే ఇప్పుడు ప్రభుత్వం గోవిందరాజులుకు గుడి కట్టించింది. ఇక్కడ ఓ ఆసక్తికరమయిన సంగతి చెప్తారు కొండాయి గ్రామస్తులు. గోవిందరాజు లుకు, సమ్మక్కకు కలిపి జాతర చేసే ముచ్చటే మొదట్లో లేదు. ఎవరి జాతర వారిదే. అయితే 1970లలో మేడారంలో పశువులు, మనుషులు జబ్బుల పాలయ్యారు. దీంతో కొంతమంది మేడారం కోయవారు కొండాయి వచ్చి గోవిందరాజుల్ని మేడారం జాతర సందర్భంగా అక్కడికి తీసుకురమ్మని కోరారు. ఇట్లా కోయపల్లెల్లో అనారోగ్య సమస్యలు(Health Problems), అశుభాలు జరుగుతున్నప్పుడు పక్క ఊళ్ళ గ్రామదేవతలను ఆహ్వానించడం పరిపాటి. అప్పటినుంచి ప్రతి మేడారం జాతరకు గోవిందరాజులును అక్కడికి తీసుకుపోయి జాతర అనంతరం తిరిగి తీసుకు వస్తున్నారు. రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురుబొంగుతో చేసిన మింటిలో గిరిజనులు తయారు చేసిన కుంకుమ వేసి దాన్ని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యధాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు కొబ్బరికాయలూ, బెల్లం బుట్టలూ కుప్పలు కుప్పలుగా సమర్పించుకుంటారు. లెక్కలేని సంఖ్యలో కోళ్ళూ, గొర్రెలూ సమ్మక్క తల్లికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. నిలువెత్తు బంగారం (బెల్లం), తలవెంట్రుకలూ ఇచ్చి జంపన్న వాగులో మునిగి సల్లగ జూడు సమ్మక్కతల్లీ అని మొక్కుకుంటారు. ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కోటికి పైగా ప్రజలు వస్తారు. ఈ జాతర యునెస్కో గుర్తింపు పొందింది. 1996 నుంచి జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. అయితే జాతీయ పండుగగా గుర్తించా లని రాష్ట్రం చాలాకాలంగా కేంద్రాన్ని కోరుతున్నది.

- మధుకర్ వైద్యుల

#medaram-festival #sammakka-saralamma-jatara #medaram-special-buses
Advertisment
తాజా కథనాలు