కరీంనగర్ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం మండలం తాడికల్ శివారులో శనివారం తెల్లవారు జామున ఓ కారు లారీనీ వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్ వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న ఓ కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారి పై బతుకమ్మల ఘాట్ మూల వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కరీంనగర్ వైపు నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారులోనే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించడంతో కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి హెడ్ కానిస్టేబుల్ లతీఫ్ ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. జెసిబి సహాయంతో కారులో నుజ్జునుజైన మృతదేహాలను బయటకుతీశారు. అందులోనే తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని బటయకు తీసి చికిత్స కోసం 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Hyderabad : సరూర్‌నగర్ అత్యచారం కేసులో నిందితుడికి కారాగార శిక్ష
ఇక మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత కారులో ఉన్న వ్యక్తల వివరాలను పరిశీలించగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమల్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లతీఫ్ తదితరులు తెల్లవారు జామున ఘటన స్థలానికి చేరుకుని సేవలందించడంతో గ్రామస్తులు, వాహనదారులు, ప్రయాణికులంతా వారికి అభినందనలు తెలిపారు.