టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ నెల 17న జరిగే విజయ భేరీ సభపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు వివరించారు. అందులో భాగంగా ఈ నెల 11 నుంచి అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. 119 నియోజకవర్గాల్లోని మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆయన.. సభకు రాష్ట్రంలోని 35 వేల బూత్‌ల నుంచి జనం తరలి వచ్చేలా చూడాలన్నారు.
సోమవారం రేవంత్ రెడ్డి 17 పార్లమెంట్ అభ్యర్థులు, వైస్ ప్రెసిడెంట్‌లతో సమావేశం కానున్నారు. వారు 12, 13, 14వ తేదీల్లో మూడురోజుల పాటు తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించే విధంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 17న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభ ఉంటుందని, ఈ సభకు సోనియా గాంధీ రానున్నట్లు తెలిపిన ఆయన.. ఆ సభలో సోనియా గాంధీ 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను వివరిస్తారన్నారు. అనంతరం సోనియా గాంధీ సెప్టెంబర్ 18న ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు చెందిన జాతీయ నాయకులతో భేటీ అవుతారని తెలిపారు.
అదే రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్యారెంటీ కార్డులకు సంబంధించిన పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా అంటించాలన్నారు. దీంతోపాటు ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు అందజేయాని పీసీసీ చీఫ్ ఆదేశించారు. ప్రతీ ఒక్కరు సమన్వయంతో పార్టీ కోసం పనిచేయాలన్న ఆయన.. ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా చూసి సభను విజయవంతం చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని, వారికి గౌరవంతో ఉన్న పదవిని కేటాయిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.