Retail Inflation: కూరగాయల ధరలు తగ్గడం వల్ల అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ట స్థాయి. సెప్టెంబర్‌లో ఇది 5.02 శాతంగా ఉంది. అదే సమయంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.62% నుంచి 6.61%కి తగ్గింది.
ద్రవ్యోల్బణం తగ్గుదల మానిటరీ పాలసీ కమిటీ (MPC)కి దాని పాలసీ వడ్డీ రేటు సమీక్షలో అదనపు బలాన్నిఅందిస్తుంది. వడ్డీ రేటును వరుసగా పెంచుకుంటూ 2.50% చేర్చిన తర్వాత, నాలుగు దఫాలుగా స్థిరంగా ఉంచింది. వచ్చే నెలలో జరిగే సమావేశంలో కూడా వడ్డీరేట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణానికి(Inflation) సంబంధించి RBI పరిధి 2%-6%. అయితే, RBI రిటైల్ ద్రవ్యోల్బణం 4% వద్ద ఉండాలని కోరుకుంటుంది. ప్రస్తుతం ఉల్లి ధరల్లో పెరుగుదల కారణంగా కూరగాయల ధరలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇది రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీయవచ్చు.
2023 సంవత్సరంలో ఇప్పటివరకూ నెల వారీగా ద్రవ్యోల్బణం రేటు ఇలా..
జనవరి | 6.52% |
ఫిబ్రవరి | 6.44% |
మార్చి | 5.66% |
ఏప్రిల్ | 4.70% |
మే | 4.25% |
జూన్ | 4.81% |
జూలై | 7.44% |
ఆగస్ట్ | 6.83% |
సెప్టెంబర్ | 5.02% |
అక్టోబర్ | 4.87% |
2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 5.4%.
అక్టోబర్ నెలలో జరిగిన ఆర్‌బిఐ ద్రవ్య విధాన సమావేశం (RBI monetary policy meeting) గురించి సమాచారం ఇస్తూ, ఆర్‌బిఐ గవర్నర్ 2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.4% వద్ద ఉంచినట్లు చెప్పారు. గత సమావేశంలో దీనిని 5.1% నుంచి 5.4%కి పెంచారు.
RBI ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది?
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, మార్కెట్లో డబ్బు తగ్గుతుంది. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుంది. అదేవిధంగా, మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరగాల్సిన అవసరం వచ్చినప్పుడు, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది.
పెట్టుబడులపై ద్రవ్యోల్బణం ఎఫెక్ట్..
ద్రవ్యోల్బణం నేరుగా కొనుగోలు శక్తికి సంబంధించినది. ఉదాహరణకు, ద్రవ్యోల్బణం రేటు 6% అయితే, సంపాదించిన రూ. 100 విలువ కేవలం రూ.94 మాత్రమే. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టుబడి (Investment) పెట్టాలి. లేదంటే మీ డబ్బు విలువ తగ్గిపోతుంది.
Also Read: దీపావళికి ప్రజలు చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోద్ది!
ద్రవ్యోల్బణం పెరగడం.. తగ్గడం ఎలా జరుగుతుంది?
ద్రవ్యోల్బణం పెరుగుదల - తగ్గుదల ఉత్పత్తి-డిమాండ్-సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉంటే వారు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే, ఈ వస్తువుల ధర పెరుగుతుంది.
ఈ విధంగా మార్కెట్ ద్రవ్యోల్బణానికి గురవుతుంది. సరళంగా చెప్పాలంటే, అధిక డబ్బు ప్రవాహం లేదా మార్కెట్లో వస్తువుల కొరత ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అయితే డిమాండ్ తక్కువగా ఉండి సరఫరా ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది.
ద్రవ్యోల్బణం ఎవరు నిర్ణయిస్తారు?
వినియోగదారులుగా, మనం రిటైల్ మార్కెట్ నుంచి వస్తువులను కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించిన ధరలలో మార్పులను చూపించే పనిని వినియోగదారు ధర సూచిక అంటే CPI(Consumer price index) చేస్తుంది. వస్తువులు సేవలకు మనం చెల్లించే సగటు ధరను CPI కొలుస్తుంది.
తయారీ ఖర్చులు కాకుండా ముడి చమురు, కమోడిటీ ధరలు, రిటైల్ ద్రవ్యోల్బణ రేటును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనేక అంశాలు ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును నిర్ణయించే ధరల ఆధారంగా దాదాపు 300 వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల ధరల పెరుగుదల.. తగ్గుదలపై ద్రవ్యోల్బణం రేటు ఆధారపడి ఉంటుంది.