గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఇప్పుడు ఒకొక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో టమాటా ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. మదనపల్లి మార్కెట్‌లో శనివారం క్వింటా టమాటా ధర వెయ్యి రూపాయలకంటే తక్కువగానే పలికింది. దీంతో కిలో టమాటా 10 రూపాయల కంటే తక్కువకే లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రైతు బజార్‌లో కిలో టమాటాను 30 రూపాలయ నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమాటా దిగుబడి అధికంగా ఉండటంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో క్వింటా టమాటా ధర 700 రూపాయలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు గత కొన్ని నెలల క్రితం ఉత్తర భారతంలో భారీగా వర్షాలు కురవడం వల్ల భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు సమీప రాష్ట్రాల్లో టమాటా తోటలు నాశనమయ్యాయి. దీంతో అక్కడి నుంచి దిగుబడి తగ్గడంతో దక్షిణ భారతంలో వీటి ధరలు కొండెక్కాయి. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం వరదలు పోటెత్తాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సైతం దిగుబడి తగ్గింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి టమాటాను దిగుమతి చేసుకున్నా.. అది కూడా అరకొర దిగుబడి కావడంతో టమాటా రేట్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు.
బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర 200 రూపాయలపైనే పలకడంతో సామాన్యులు, రోజువారీ కూలీలు టమాటాలను కొనుగోలు చేయలేక పోయారు. దీంతో వాటిని తినడమే మానేశారు. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన టమాటాను చాలా మంది కొన్ని రోజులుగా వంటకాల్లో ఉపయోగించడంలేదు. కానీ ప్రస్తుతం రేట్లు తగ్గడంతో టమాటా కొనుగోళ్లు ప్రారంభించారు.