రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అరేంజ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 25 నుంచి మూడు రోజులపాటు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌లలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ :
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పనుల కోసం బయటకు వెళ్లేవారు వర్షం పరిస్ధితులను అంచనా వేసుకుని బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. పాతబిల్డింగులలో ఉంటున్నవాళ్లు తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్ పోల్ ల విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. రోడ్లపై వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్స్ ను గమనించాలని అధికారులు చెబుతున్నారు.
అటు గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌లో అత్యధికంగా 464 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.... హైదరాబాద్‌లో చార్మినార్‌లో 79 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) తెలిపింది. వర్షపాత సూచనల దృష్ట్యా, నగరవాసుు అత్యవసరమైతేనే తప్పా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. కాగా ఇప్పటికే కురిసిన భారీవర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నాు. ఈ నేపథ్యంలో ఈనెల 26వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.