మరోవైపు లోతట్టు ప్రాంత కాలనీల్లో నీళ్లు నిలవడంతో స్థానిక కాలనీ వాసులు ఇబ్బందులకు గురౌతున్నారు. గత వారంరోజులుగా నీరు నిల్వ ఉండటంతో దోమలు (Mosquitoes) వస్తున్నట్లు సరూర్ నగర్ పరిధిలోని కాలనీవాసులు తెలిపారు. దీంతో తాము అనేక రోగాల (Diseases) భారిన పడే అవకాశం ఉందని, అధికారులు వరద నీటిని తొలగించాలని వారు కోరుతున్నారు. అంతే కాకుండా వరదనీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీలు సైతం పొంగి పొర్లుతుండటంతో దుర్వాసనను భరించలేక పోతున్నామంటున్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా తాము ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నామని, బయటకు వస్తే జారి ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. తమ పిల్లలు సైతం వరద నీటి గుండానే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు తెలిపారు.
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో నేడు రేపు 204 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందనిహెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు, ఇప్పటికే నీరు నిల్వ ఉన్న కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ (ghmc) ఇప్పటికే చర్యలు కూడా చేపట్టింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బుధ, గురువారులు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల(Educational institutions)కు సెలవులు ప్రకటించింది. దీంతో పాటు ఐటీ ఉద్యోగులకు సైతం పలు సూచనులు చేసింది. నగరంలోని ఉద్యోగులు మూడు విభాగాల్లో లాగౌట్ (Logout) చేయాలని సూచనలు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 7 గంటలకు లాగౌట్ చేయాలని, ఈ విధంగా ఐటీ సంస్థలు (IT organizations) చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీంతో నగరంలో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.