తెలంగాణ ఎన్నికల ప్రచారం, సభలు చాలా హడావుడిగా ఉంది. ఈరోజుతో ప్రచారం ముగిసిపోతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ కూడా జరుగనుంది. పోలింగ్ వందశాతం జరగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటూ ప్రవైటు సంస్థలు కూడా ఓటింగ్ బాగా జరిగేందుకు సహకరిస్తామని ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 26 పోలింగ్‌స్టేషన్‌లకు రాపిడో సేవలు లభించనున్నాయి. దీని కోసం ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్‌లో ‘ఓట్ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు ఫ్రీగా ర్యాపిడో బుక్ చేసుకోవచ్చును. ఎంత దూరం అయినా హాయిగా వెళ్ళి ఓటు వేసి రావచ్చును. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు.
హైదరాబాద్ లో మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా చేరవేస్తామని రాపిడో కంపెనీ తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ప్రయాణ ఖర్చుల కారణంగా కొంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ప్రకటించినట్లు రాపిడో చెబుతోంది. నగరంలో ఎక్కడి నుంచైనా తమ పోలింగ్ బూత్ కు ఉచితంగా వెళ్లేందుకు తమ సంస్థ సహాయం చేస్తుందన్నారు. ఈ ఉచితం ఆఫర్ ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ స్టేషన్‌లకు తరలించడంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం భారతదేశానికి ఆభరణమని.. ఆ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.